ఆటో డ్రైవర్లతో ‘లంచ్ పే చర్చ’.. ఢిల్లీలోని పార్కులో డ్రైవర్లతో కూర్చొని భోజనం చేసిన రాహుల్ గాంధీ

ఆటో డ్రైవర్లతో ‘లంచ్  పే చర్చ’.. ఢిల్లీలోని పార్కులో డ్రైవర్లతో కూర్చొని భోజనం చేసిన రాహుల్ గాంధీ
  • గ్యాస్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ముచ్చట

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్లను కలిశారు. డ్రైవర్ యూనిఫాం ధరించిన ఆయన.. తోడర్‌‌‌‌‌‌‌‌మల్ పార్కులో వారితో కలిసి కింద కూర్చుని 'లంచ్ పే చర్చ' జరిపారు. డ్రైవర్లు ఆప్యాయంగా వడ్డించిన రొట్టెలు, పప్పు, ఆలూ సబ్జీని తింటూ.. వారి కష్టసుఖాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా గ్యాస్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వల్ల బతుకుదెరువు ఎంత భారంగా మారిందో ఆయనకు ఆటో డ్రైవర్ అరిందర్ కుమార్ షా వివరించారు. తాము లంచ్ చేస్తుండగా రాహుల్ అనుకోకుండా వచ్చి కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మరో డ్రైవర్ సంతోషం వ్యక్తం చేశాడు. 

వ్యాపారం నడవక పిల్లల చదువులు, తిండి ఖర్చులకే ఇబ్బంది పడుతున్నామని రమేశ్ ప్రసాద్ అనే డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైవర్ల సమస్యలపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తానని రాహుల్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లతో రాహుల్ ముచ్చటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అంతకుముందు రాహుల్ తన నివాసం బయట కూడా డ్రైవర్లను కలిసి వారి సంక్షేమం, ఇన్సూరెన్స్, రోజువారీ సవాళ్లపై చర్చించారు. ఈ పర్యటనలో స్థానిక పిల్లలతోనూ ముచ్చటించిన ఆయన.. వారితో కలిసి సెల్ఫీలు దిగారు. కాగా, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేసిన నేపథ్యంలో.. అక్కడి కొత్త మంత్రివర్గ కూర్పు, పార్టీ సంస్థాగత బాధ్యతలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి, ఆయనతో సమావేశమయ్యారు.
 

  • విద్యార్థుల భవిష్యత్తుపై మోదీకి శ్రద్ధ లేదు.. 

సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ వివాదంపై ప్రధాని మోదీ మౌనం వహించడం, విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే.. ఆయనకు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే తన ప్రభుత్వ మనుగడే ముఖ్యమని అర్థమవుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎమ్) విధానం, అలాగే 'కోఎంప్ట్' సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడంపై మొదటి రోజు నుంచే తాను స్వతంత్ర న్యాయ విచారణను డిమాండ్ చేస్తున్నానని, దేశ యువతకు నిజం తెలిసే హక్కు ఉందని ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

తన పోస్ట్‌‌‌‌‌‌‌‌లో కొన్ని మీడియా కథనాలను జోడించిన ఆయన.. వాటిని జాగ్రత్తగా చదవాలని ప్రజలను కోరారు. ‘‘సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఓఎస్‌‌‌‌‌‌‌‌ఎమ్  కోసం మూడుసార్లు టెండర్లు పిలిచింది. మొదటిసారి, రెండోసారి అర్హత కలిగిన బిడ్డర్ ఎవరూ లేరు. చివరకు కోఎంప్ట్ సంస్థ అర్హత సాధించేలా నిబంధనలను సడలించారు. స్కానింగ్ రిజల్యూషన్‌‌‌‌‌‌‌‌, రోబోటిక్ స్కానర్ అవసరాన్ని తొలగించారు. సీఎంఎంఐ సర్టిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను లెవెల్ 5 నుంచి లెవెల్ 3కి తగ్గించారు. మూల్యాంకనంలో తప్పులు జరిగితే విధించే జరిమానాలను ఎత్తివేశారు. ప్రముఖ సంస్థ టీసీఎస్ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అర్హత సాధించినా.. దానికి కాంట్రాక్ట్ దక్కలేదు. 

ప్రస్తుతం సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ విద్యార్థులు సరిగ్గా స్కాన్ చేయని జవాబు పత్రాలు, మిస్సయిన పేజీలు, సాంకేతిక లోపాలతో ఉన్న మూల్యాంకన పోర్టల్ గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు కనీసం ఒకటి లేదా రెండేండ్లపాటు సన్నద్ధత అవసరమని టీచర్లు సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈని హెచ్చరించినా పట్టించుకోలేదు. 18.5 లక్షల మంది పిల్లల భవిష్యత్తును రూల్స్ మార్చి మరీ అర్హత కల్పించిన ఒక సంస్థ చేతిలో పెట్టారు’ అని రాహుల్ మండిపడ్డారు.