కేంద్రానికి, బలగాలకు పూర్తి మద్దతు: రాహుల్

కేంద్రానికి, బలగాలకు పూర్తి మద్దతు: రాహుల్

న్యూఢిల్లీ: పుల్వామా దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో దేశమంతా విషాదంలో ఉందన్నారు. మన జవాన్లపై ఇలాంటి దాడులు జరగడం దారుణమని, ఈ సమయంలో మనమంతా వారికి అండగా నిలవాలని ఆయన చెప్పారు. ఏ దుష్ట శక్తులూ భారత ఐక్యతను పాడు చేయలేవని, మనల్ని విడగొట్టే కుట్రలు పారవని రాహుల్ అన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. భారత ప్రభుత్వానికి, బలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ చెప్పారు. ఈ సమయంలో ఇంతకు మించి ఏమీ మాట్లాడనన్నారు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

అమర జవాన్లకు మన్మోహన్ సింగ్ సంతాపం ప్రకటించారు. మన దేశం దాదాపు 40 మంది వీర జవాన్లను కోల్పోయిందని అన్నారు. దేశమంతా వారికి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేయడం మన భాద్యత అని అన్నారు. ఉగ్ర మూకలను అణచివేయడంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారికి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు.