మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి: రాహుల్ గాంధీ

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి: రాహుల్ గాంధీ
  •     అప్పటిదాకా పోరాడుతూనే ఉంటాం: రాహుల్ గాంధీ
  •     రాయ్ బరేలీలో హత్యకు గురైన దళితుడి కుటుంబానికి పరామర్శ

రాయ్ బరేలీ: ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీ జిల్లాలో ఓ సెలూన్  దుకాణంలో హత్యకు గురైన దళితుడు అర్జున్  పాసీ (22) కుటుంబాన్ని కాంగ్రెస్  ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఫుర్సత్  గంజ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా భువల్పూర్​లోని సిస్నీ గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం భువల్పూర్​లో మీడియాతో రాహుల్  మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, అర్జున్​ను కాల్చి చంపిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్  చేశారు.

నిందితులు దళితుడిని చంపడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను సైతం బెదిరించారని చెప్పారు. ఇప్పటికీ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్నీ గౌరవించాలని, ప్రతిఒక్కరికీ న్యాయం జరగాలన్నారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అప్పటి దాకా తాము పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ‘‘మృతుడి తల్లితో మాట్లాడాను. తన చిన్న కొడుకు అర్జున్  సెలూన్ షాపులో పనిచేస్తాడని ఆమె చెప్పారు. నిందితుల్లో ఒకడు ఆరేడు సార్లు దుకాణానికివచ్చి హెయిర్ కట్ చేయించుకొని డబ్బులు ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై నిలదీస్తే అర్జున్ ను తుపాకీతో కాల్చి చంపారని ఆ తల్లి కన్నీరు పెట్టుకున్నారు” అని రాహుల్ గాంధీ వివరించారు.కాగా.. ఈ నెల 11న అర్జున్  పాసీతో  కొంతమంది స్థానికులు గొడవ పెట్టుకున్నారు. తర్వాత అతడిని తుపాకీతో కాల్చి చంపారు.

నాన్నా.. నీ కలలు నెరవేరుస్త..

దివంగత ప్రధాని రాజీవ్  గాంధీ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్  ఎంపీ రాహుల్  గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమి స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. తన తండ్రి బోధనలు తనకు ఎంతో స్ఫూర్తి ఇస్తాయని ట్విట్టర్ లో రాహుల్  పేర్కొన్నారు. ‘‘నాన్నా! మీరు ఎంతో దయగల వ్యక్తి. సఖ్యత, సామరస్యానికి మీరు ప్రతీక. దేశం కోసం మీరు కన్న కలలను నేను నెరవేరుస్తా. మీ ఆశయ సాధన కోసం కృషిచేస్తా” అని రాహుల్  ట్వీట్  చేశారు. 

అలాగే, రాహుల్  సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన తండ్రికి నివాళులర్పించారు. ఆయన సేవలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. ‘‘సైన్స్  అండ్  టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్  రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా మీరు కృషిచేశారు. గ్రామస్తుల చేతిలోనే పరిపాలన ఉండేలా చేశారు. సూర్యుడి కిరణాలలాగా మీ జీవితం కూడా మమ్మల్ని ముందుకు నడుపుతుంది” అని ప్రియాంక ట్వీట్  చేశారు. అలాగే కాంగ్రెస్  చీఫ్  మల్లికార్జున్  ఖర్గే కూడా రాజీవ్ కు నివాళి అర్పించారు. దేశవ్యాప్తంగా రాజీవ్  జయంతిని ఘనంగా నిర్వహించారు.