అయోధ్యకు ఏ దళితుడినైనా పిలిచాడా మోదీ : రాహుల్ గాంధీ

అయోధ్యకు ఏ దళితుడినైనా పిలిచాడా మోదీ : రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గత నెలలో జరిగిన రామమందిరం ప్రారంభోత్సవానికి బీజేపీ అందించిన ఆహ్వానాలపై  ఆయన మండిపడడ్డారు.   అమితాబ్ బచ్చన్ లాంటి  బాలీవుడ్ స్టార్లను ఆహ్వానించారు కానీ ..   బీసీ, ఎస్సీ, ఎస్టీలను  ఒక్కర్ని నైన ఆ కార్యక్రమానికి ఆహ్వానించారా అని రాహుల్  ప్రశ్నించారు. 

 "మీరు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూశారా. అందులో ఒక్కరైనా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖాలను చూశారా. కానీ ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కానీ దేశాన్ని నిజంగా నడిపించే వ్యక్తులను మనం అంత గొప్ప కార్యక్రమంలో చూడలేదు. వాళ్లు దేశాన్ని ఎప్పటికీ నియంత్రించలేరని గుర్తుంచుకోవాలి" అని రాహుల్ గాంధీ చెప్పారు. 

రామమందిర  ప్రారంభోత్సవం..  అట్టడుగు కులాలకు ప్రాతినిధ్యం లేని దృశ్యమని రాహుల్ గాంధీ అభివర్ణించారు.  యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చ్ సందర్భంగా  రాహుల్ కామెంట్స్ చేశారు. సామాజిక అసమానతలను బహిర్గతం చేయడానికి కుల గణన అవసరమని మరోసారి  చెప్పారు.  కుల గణన అనేది దేశంలోని ఎక్స్‌రే.. దీని వల్ల అన్నీ వెల్లడవుతాయని తెలిపారు.  

ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అధ్యక్షతన జరిగిన రామమందిర వేడుకల్లో వేలాది మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.   కాగా  రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సోమవారం  అమేథీలోకి ప్రవేశించనుంది.