నేరస్తులను సర్కారే కాపాడుతోంది.. మహిళా డాక్టర్ సూసైడ్ ఘటనపై రాహుల్ గాంధీ

నేరస్తులను సర్కారే కాపాడుతోంది.. మహిళా డాక్టర్ సూసైడ్ ఘటనపై రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన మహిళా డాక్టర్ సూసైడ్ అంశంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. డాక్టర్‎ది ఆత్మహత్య కాదని, వ్యవస్థ చేసిన హత్య అని ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. నేరస్తులను ఫడ్నవీస్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. బాధితురాలితో బీజేపీ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని మండిపడ్డారు.

‘‘మహిళా డాక్టర్ ఆత్మహత్యతో యావత్ పౌరసమాజం దిగ్భ్రాంతి చెందింది. ఎంతో భవిష్యత్తు ఉన్న బాధితురాలు, ఇతరుల కష్టాలను పోగొట్టాలని కలలు కన్న డాక్టర్.. నేరస్తుల వేధింపులకు బలిపశువు అయింది. నేరస్తుల నుంచి ప్రజలను కాపాడాల్సిన వారే ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. 

బీజేపీతో సంబంధం ఉన్న, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న కొంతమంది.. అవినీతికి పాల్పడేలా ఆ డాక్టర్‎పై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికార బలం ఉన్న నేరగాళ్లు ఎంతటి దారుణానికి పాల్పడుతారన్న దానికి బాధితురాలి ఆత్మహత్యే ఓ నిదర్శనం” అని రాహుల్  వ్యాఖ్యానించారు. 

నేరస్తులను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని, ఇక బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఎలా ఆశించగలమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె కుటుంబానికి అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని రాహుల్  హామీ ఇచ్చారు.

నాలుగు రోజుల కస్టడీకి బంకర్

మహిళా డాక్టర్ సూసైడ్​కేసులో ఎస్సై గోపాల్ బద్నేతో పాటు మరో నిందితుడు సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ప్రశాంత్‎ను సతారా జిల్లా కోర్టు నాలుగు రోజుల కస్టడీకి పంపింది. ఎస్సైతో పాటు ప్రశాంత్ కూడా తనను వేధించాడని డాక్టర్ తన సూసైడ్ నోట్‎లో పేర్కొన్నారు. కాగా.. బీడ్ జిల్లాలోని వద్వానీలో శుక్రవారం రాత్రి డాక్టర్ అంత్యక్రియలు జరిగాయి. 

ఆమె ఆత్మహత్యకు కారకులైన వారికి మరణశిక్ష విధించాలని డాక్టర్ బంధువులు డిమాండ్ చేశారు. ఎస్సై తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా ఎవరూ ఆమె బాధను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పనిచేస్తున్న హాస్పిటల్‎లో మెడికల్ రిపోర్టు మార్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.