ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు.. .శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేస్తం : రాహుల్ గాంధీ

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు..  .శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేస్తం : రాహుల్ గాంధీ
  • ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు
  • డెలివరీ బాయ్స్​కు సోషల్ సెక్యూరిటీ కల్పిస్తం 
  • ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలన్నీ పరిష్కరిస్తం
  • డ్రైవర్లు, పారిశుధ్య సిబ్బంది, డెలివరీ బాయ్స్​తో రాహుల్ సమావేశం

హైదరాబాద్, వెలుగు : ‘‘తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తం. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తం. శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేస్తం. సీఎం, మంత్రులతో కలిపి ఓ సమావేశం నిర్వహించి.. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం యూసుఫ్ గూడలోని మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్ లో  ఆటో, క్యాబ్ డ్రైవర్లు, జీహెచ్ఎంసీ శానిటేషన్ కాంట్రాక్టు కార్మికులు, డెలివరీ బాయ్స్ తో రాహుల్​ఇంటరాక్ట్ అయ్యారు. ముందుగా డెలివరీ బాయ్స్ తో మాట్లాడిన రాహుల్ వారి కష్టాలు తెలుసుకున్నారు. రోజుకు ఎంత డబ్బు వస్తుందని ఆరా తీశారు.

డైలీ 38  ఆర్డర్లు డెలివరీ చేస్తామని, దీనికి 3 నుంచి 4 లీటర్ల పెట్రోల్ అవసరం ఉంటుందని, పెట్రోల్ కే రూ.400 పోతుందని, గిట్టుబాటు కావడంలేదని రాహుల్ కి చెప్పారు. తమకు టూ వీలర్స్ ఇప్పించాలని, పెట్రోల్ రేట్ తగ్గించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్​ సౌకర్యం కల్పించాలన్నారు. అందరికీ తిండి తీసుకెళ్లే తాము.. టైమ్ కి తినకుండా కష్టపడుతున్నామని, రోడ్డుపై రిస్క్ తో ఉద్యోగం చేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్​లో వర్కర్లను కేటగిరీలుగా విభజించి ఆదుకుంటున్నామని, కొంత కంపెనీ నుంచి తీసి పెన్షన్, సోషల్ సెక్యూరిటీ కోసం ఉంచేలా చట్టం తీసుకొచ్చామని రాహుల్ చెప్పారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం తీసుకొస్తామన్నారు.

పదేండ్లుగా సమస్యలు తీరడం లేదు..

గత పదేండ్లుగా తమ సమస్యలు తీరడం లేదని క్యాబ్, ఆటో డ్రైవర్లు రాహుల్ తో అన్నారు. సంక్షేమ ఫలాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే అందుతున్నాయని చెప్పారు. సంపాదన అంతా పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌, గ్యాస్ కే పోతోందని, చలానాలతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.  అందరి సమస్యలు పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు పెడ్తామన్నారు. చలాన్ల కోసం 50 శాతం రాయితీ, సింగిల్ పర్మిట్ పాలసీ తీసుకొస్తామన్నారు.  తర్వాత యూసుఫ్ గూడ నుంచి కిలోమీటర్ మేరా రాహుల్ ఆటోలో ప్రయాణించారు.

పనికితగ్గ వేతనం ఇస్తలే..

జీహెచ్​ఎంసీ కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్లతో రాహుల్ మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడం లేదని వారు రాహుల్​ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏండ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్ కావడంలేదని చెప్పారు. తమపై దయచూపి పర్మినెంట్ చేయాలని రాహుల్‌‌‌‌‌‌‌‌కు విన్నవించారు. ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెండు ప్రైవేట్ ఏజెన్సీల కింద తామంతా పనిచేస్తున్నామని, వారు కేసీఆర్ జేబులు నింపడానికే పని చేస్తున్నారని, దీంతో తాము నష్టపోతున్నామని చెప్పారు. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని

ఇన్సూరెన్స్ లేదని, బీఆర్​ఎస్​ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు తీర్చాలని రాహుల్ గాంధీని కోరారు. ఆ తరువాత రాహుల్ మాట్లాడుతూ.. పర్మినెంట్ చేస్తే తమకు ఫాయిదా అవుతుందని, జీతాలు పెంచితే మీకు మేలు జరుగుతుందని.. మా ప్రభుత్వం రాగానే ఈ  పనులు చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 

బీజేపీ చెప్పిన అభ్యర్థికే ఎంఐఎం టికెట్ 

ఎంఐఎం ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తుందని, బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని ఆ మూడు పార్టీలు ఒక్కటే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కేసీఆర్ అవినీతికి పాల్పడినా ఒక్క కేసు ఉండదని, తాను బీజేపీని విమర్శించినందుకు 24 కేసులు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాంపల్లిలో కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒవైసీ.. మోదీకి రహస్య స్నేహితుడని, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించారు. బీజేపీ ఇచ్చిన లిస్ట్​తోనే ఎంఐఎం పోటీ చేస్తుందని, అందుకే ఎంఐఎం నేతలు ఏం చేసినా కేసులుండవన్నారు.

.బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు విమర్శిస్తారు కానీ ఎంటువంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే మోదీ, కేసీఆర్ రహస్య స్నేహితులని అన్నారు. 2024లో మోదీని ఓడించాలంటే ముందుగా తెలంగాణలో బీఆర్ఎస్​ను ఓడించాలని రాహుల్ ప్రజలను కోరారు. విద్వేషం మన దేశ సంస్కృతి కాదని, బీజేపీ మాత్రం విద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నదని అన్నారు. అందరికీ ప్రేమ పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశానని, యాత్రలో భాగంగా ఎంతో మందిని కలిసి, చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.