జూన్​ 4న ఇండియా సర్కార్ .. రాజ్యాంగాన్ని రక్షిస్తం.. రిజర్వేషన్లు పెంచుతం : రాహుల్​ గాంధీ

జూన్​ 4న ఇండియా సర్కార్ .. రాజ్యాంగాన్ని రక్షిస్తం.. రిజర్వేషన్లు పెంచుతం : రాహుల్​ గాంధీ
  • పంద్రాగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాల భర్తీ మొదలు పెడ్తం
  • దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి రూ. లక్ష
  • యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, రూ. లక్ష సాయం
  • కార్పొరేట్లకు మోదీ ఎంత దోచిపెట్టారో.. అంత సొమ్మును పేదలకు పంచుతం
  • అదానీ, అంబానీ కోసమే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అని విమర్శ

హైదరాబాద్‌‌/మెదక్‌‌/నర్సాపూర్, వెలుగు: జూన్​ 4న కేంద్రంలో ఇండియా కూటమి సర్కార్​ ఏర్పడబోతున్న దని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ అన్నారు. ‘‘కేంద్రంలో మేం అధికారం  చేపట్టగానే దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి, పంటలకు మద్దతు ధర కల్పిస్తం. పేద మహిళల ఖాతాల్లో ఏడాదికి లక్ష రూపాయల చొప్పున జమ చేస్తం. పంద్రాగస్టు నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను స్టార్ట్​ చేస్తం” అని  ప్రకటించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా, ఆర్‌‌ఎస్‌‌ ఎస్‌‌ వాళ్లు కలిసి రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.+

 కానీ తాము దేశానికి ఆత్మలాంటి రాజ్యాంగాన్ని రక్షించి.. వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌‌ పట్టణంలో, హైదరాబాద్​ సరూర్​నగర్ ​స్టేడియంలో ​గురువారం నిర్వహించిన కాంగ్రెస్​ జనజాతర సభల్లో రాహుల్​గాంధీ మాట్లాడారు. దేశంలో రాజ్యాంగ రచన కంటే ముందు అట్టడుగు వర్గాల ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని అన్నారు. అలాంటి వారికి రాజ్యాంగం అండగా నిలబడిందని, ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అదానీ, అంబానీ కోసమే మోదీ పనిచేస్తడు 

‘‘అదానీ, అంబానీ కోసం తప్ప పేదల కోసం ఎన్నడూ మోదీ పనిచేయలే. అదానీ కోసమే మోదీ పెద్ద నోట్ల రద్దు చేపట్టిండు. తప్పుడు జీఎస్టీ తెచ్చిందీ అందుకే. ఎయిర్​పోర్టులు, నౌకాశ్రయాలు, ప్రభుత్వరంగ సంస్థలన్నీ అదానీపరం చేసిండు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటైజ్​ చేస్తూ పోతున్నడు’’ అని రాహుల్​ ఆరోపించారు. 

దేశసంపదను అదానీ, అంబానీ లాంటి 22 మందికి మోదీ దోచిపెట్టి, వాళ్లను ట్రిలియనీర్లుగా మార్చారని.. కార్పొరేట్​ సంస్థలకు రూ. 16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేశారని, పేద రైతులకు మాత్రం ఎలాంటి రుణాలు మాఫీ చేయలేదని మండిపడ్డారు. కార్పొరేట్లకు రూ. 16 లక్షల కోట్లు మోదీ మాఫీ చేసినప్పుడు చప్పుడు చేయని మీడియా తాము పేదల ఖాతాల్లో డబ్బు వేస్తామంటే మాత్రం ఎలా వేస్తారని అడుగుతున్నదని విమర్శించారు. ‘‘కార్పొరేట్లకు మోదీ ఎంత సొమ్మను దోచిపెట్టారో మేము అంత సొమ్మును పేదలకు పంచుతాం. 22 మంది కోటీశ్వరుల కోసం మోదీ పనిచేస్తే.. కోట్ల మంది పేద ప్రజలను కోటీశ్వరులను చేసేందుకు మేం పనిచేస్తం” అని ఆయన చెప్పారు. 

మహిళల అకౌంట్లలో  కటాకట్​ పైసలు జమైతయ్​

దేశంలో కులగణన చేపట్టాలన్న లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని రాహుల్‌ గాంధీ చెప్పారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనార్టీలు, సామాన్యుల్లోనూ రాజకీయ చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ‘‘కేవలం రెండు శాతం ఉన్న వర్గాల చేతుల్లోనే దేశ సంపద ఉంది. వాళ్లే దేశాన్ని శాసిస్తున్నరు. మేం  అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులాలవారీగా జనగణన చేస్తం..  ఇంటింటికీ వెళ్లి నిరుపేద కుటుంబాల జాబితాను రూపొందిస్తం. ఆ లిస్టు ఆధారంగా పేదింటి మహిళల అకౌంట్లలో నెలకు రూ. 8500 చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు డిపాజిట్​ చేస్తం.

 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల అకౌంట్లలో కటా కట్​ టకా టక్​ పైసలు జమైతయ్​. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం అవుతది” అని తెలిపారు.  మోదీ లక్ష్యం రిజర్వేషన్లు సమూలంగా తీసేయడమేనని ఆయన ఆరోపించారు. కులగణన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా 50 శాతా నికి మించి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు.

ప్రైవేటైజేషన్​ద్వారా ప్రధాని మోదీ కోట్లాది మంది యువకులను నిరుద్యోగులుగా మార్చారని, తాము అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ పంద్రాగస్టునాటికి ప్రారంభిస్తామని  హామీ ఇచ్చారు. ‘‘నిరుద్యోగులకు అప్రెంటిషిప్​ కల్పిస్తాం. గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసిన విద్యార్థులకు, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చూపుతాం. ప్రైవేటు, పబ్లిక్​ సెక్టార్లలో,  యూనివర్సిటీల్లో, హాస్పిటల్స్​లో.. ఇలా ప్రతి చోటా ఉపాధి చూపుతాం. ఏడాది శిక్షణలో లక్ష రూపాయలు అందిస్తం’’  ఆయన ఆయన వివరించారు. 

దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా పథకాలు

‘‘ఇండియా కూటమి అధికారం చేపట్టగానే.. తెలంగాణ తరహాలో దేశంలో అన్ని పథకాలు అమలు చేస్తం. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక  సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలోని టీమ్​ ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు కల్పించింది.  పేద మహిళలకు రూ.500 గ్యాస్ అందిస్తున్నది. రూ.10లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నది. మహిళకు ఫ్రీ బస్సు జర్నీ,  పేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్​ సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ హామీలను దేశవ్యాప్తంగా అమలు చేస్తం..’’ అని రాహుల్​ చెప్పారు. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, దేశంలో ఇండియా కూటమి సర్కార్​ ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. 

ఆయా సభల్లో సీఎం రేవంత్​రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్​ దీపాదాస్‌ మున్షీ, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్​ ఎంపీ అభ్యర్థి నీలం మధు, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి, మల్కాజ్​గిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్​రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సిటీ బస్సులో రాహుల్, రేవంత్ జర్నీ

సరూర్​నగర్  జనజాతర సభ తర్వాత కాంగ్రెస్  నేత రాహుల్, సీఎం రేవంత్  రెడ్డి సిటీ బస్సులో ప్రయాణించారు. రాహుల్  తన తిరుగు ప్రయాణంలో దిల్​సుఖ్​నగర్  వద్ద రేవంత్​తో కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులకు రాహుల్  కాంగ్రెస్  పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు. కాంగ్రెస్  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి ఈ సందర్భంగా  మహిళలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

అన్ని పంటలకు మద్దతు ధర 

కేంద్రంలో తమ  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ  చేస్తామని రాహుల్​ ప్రకటించారు. వరితో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందేలా చూస్తామన్నారు.ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ప్రస్తుతం రోజు వారి కూలీ రూ. 250 అందుతున్నదని, కాంగ్రెస్‌ గెలిచాక రూ. 400 ఇస్తామని ఆయన  చెప్పారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలను కూడా రెట్టింపు చేస్తామని తెలిపారు. 

రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు.. అది పేద ప్రజల గొంతుక, గుండె చప్పుడు.. రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయి. రాజ్యాంగం ద్వారానే  పేదలకు అధికారం, రిజర్వేషన్లు వచ్చాయి.. మేధావులు, మహామహులు ఏండ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగాన్ని అందించారు. ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్లు తమ చెమటను, రక్తాన్ని ధారపోశారు. ప్రపంచంలో ఎవ్వరూ మన రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు.. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మేమంతా పోరాడుతాం.

రాహుల్ ​గాంధీ