మహిళ కన్నీళ్లు తుడిచి.. ఓదార్చిన రాహుల్ గాంధీ

మహిళ కన్నీళ్లు తుడిచి.. ఓదార్చిన రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ మే 25న జరగనుంది. ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో  ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలోని మహిళలతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ మహిళ తన బాధను వెల్లబోసుకుంది. బీజేపీ పాలనలో  పెరిగిన ధరలతో తనపై భారం పెరిగిందని..తనకు భర్త  లేడని ..  నలుగురు పిల్లలను పెంచి పోషించడానికి నానా కష్టాలు పడుతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు.  పిల్లల చదువులకు డబ్బుల్లేక ఇబ్బందిగా ఉందని చెప్పారు. దీంతో మహిళ కన్నీళ్లకు చలించిన రాహుల్ స్టేజ్ పై నుంచి వెంటనే ఆ మహిళ దగ్గరకు వచ్చి కన్నీళ్లు తూడ్చారు. భుజం తట్టి ఓదార్చారు. అండగా ఉంటామని(ఆప్ మేరీ జిమ్మేదారీ) ధైర్యం చెప్పారు .  స్టేజ్ పైకి తీసుకెళ్లి స్థానిక నాయకులతో మాట్లాడించి ఆమె  సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  

 ప్రధాని మోదీపై  సెటైర్లు 

తనను దేవుడే పంపాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ సెటైర్లు వేశారు. మోదీలా ఎవరైనా మాట్లాడితే వారిని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు.  దేశ సంపదను మోదీ అంబానీ ,ఆదానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ,రోడ్లు,ఆస్పత్రులు, విద్య కోసం మోదీ ఏం చేయరని చెప్పారు.  భారతదేశంలోని 90 శాతం మంది పేదలు, ఆదివాసీలు, దళితులు వంటి వారికి దేశంలో ఎలాంటి హక్కు లేదన్నారు.

నోట్ల రద్దు తర్వాత  దేశంలో మొత్తం వ్యవస్థ కుంటుపడింది..  ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు మూతపడ్డాయి. టీ షర్టులు..ప్యాంటులను తయారు చేసే ఫ్యాక్టరీలు ఇప్పుడు పనిచేయడం లేదు.. బంగ్లాదేశ్ ఇప్పుడు వస్త్రాల తయారీలో మన కంటే ముందు ఉందని రాహుల్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు సర్ ప్రైజ్ గా ఉంటాయని చెప్పారు.