మోదీ 3.0 మనుగడ కష్టమే : రాహుల్​ గాంధీ

మోదీ 3.0 మనుగడ కష్టమే : రాహుల్​ గాంధీ
  • ఎన్డీయే నేతలు మాతో టచ్​లో ఉన్నారు

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో టెక్టానిక్  షిఫ్ట్  వంటివని కాంగ్రెస్  ఎంపీ రాహుల్  గాంధీ అన్నారు. మోదీ 3.0 మనుగడ కష్టమే అని, ఎన్డీయే కూటమిలో ఏ చిన్న కదలిక వచ్చినా ప్రభుత్వం కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. యూకేకు చెందిన ఫైనాన్షియల్  టైమ్స్​కు రాహుల్  ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్డీయే కూటమికి వచ్చిన నంబర్లు చాలా సున్నితమైనవని చెప్పారు.

 ప్రధాని నరేంద్ర మోదీ క్యాంపులో భారీ ఎత్తున అసంతృప్తి ఉందని, ఎన్డీయే కూటమి నేతలు పార్టీ మారే అవకాశం ఉందన్నారు. ఆ కూటమిలో కొంతమంది నేతలు తమతో టచ్​లో ఉన్నారని చెప్పారు. ‘‘బీజేపీ విభజిత రాజకీయాలకు 2024 ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు. మీరు (మోదీ) ద్వేషం, కోపాన్నే వ్యాప్తి చేశారు. ఇప్పుడు మీకు అదే తిరిగొచ్చింది. 

మా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేసి ముస్లింలకు ఇస్తారని మోదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కానీ.. అబద్ధాలు, ద్వేషం, కోపాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు.  గడిచిన పదేండ్లుగా అయోధ్య గురించి మాట్లాడిన పార్టీ అయోధ్యలో తుడిచిపెట్టుకుపోయింది. మతపరమైన ద్వేషాన్ని సృష్టించిన బీజేపీ ఈ ఎన్నికల్లో కూలిపోయింది” అని రాహుల్  వ్యాఖ్యానించారు.