తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు
  • తెలంగాణ ప్రజలను మోసం చేసిండు: రాహుల్​
  • రాజులా వ్యవహరిస్తున్నడు.. జనం బాధలు పట్టించుకుంటలేడు
  • రాష్ట్రంలో బాగుపడ్డది ఒక్క కుటుంబమే.. నియంతృత్వ పాలన సాగుతున్నది
  • టీఆర్​ఎస్​తో పొత్తు ఉండదు.. పొత్తు కోరుకునేవాళ్లను పార్టీ నుంచి పంపేస్తం
  • వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​​ను ఓడించి తీరుతం.. పేదల సర్కార్​ను తెస్తామని వెల్లడి 
  • వరంగల్​లో ‘రైతు సంఘర్షణ సభ’కు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్​ కేడర్​

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా అభివృద్ధి కలగానే ఉంది. ఒక్క కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగింది. తెలంగాణ ప్రజలు కన్న కల ఏమైంది? తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు? ఇక్కడ స్టేజ్​ మీద ఉన్న రైతుల కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి.. వాటికి ఎవరు జిమ్మేదార్. వారికి ఎవరు సమాధానం చెప్తారు? చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉంది. అక్కడ  మేం మాటకు కట్టుబడి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేశాం. వరికి కనీస మద్దతు ధర రూ. 2,500 ఇస్తున్నాం. ఇక్కడి ముఖ్యమంత్రి రైతుల బాధలను పట్టించుకోవడం లేదు. వాళ్ల కష్టాలను వినడం లేదు. ఇద్దరు ముగ్గురు వ్యాపారుల మాటలే వింటున్నాడు.

హైదరాబాద్​/ వరంగల్​, వెలుగు: రాష్ట్ర ప్రజలను కేసీఆర్​ మోసం చేస్తున్నారని, లక్షల కోట్లు దోచుకున్నారని, ఆయనను వదిలే ప్రసక్తేలేదని కాంగ్రెస్​ ముఖ్య నేత రాహుల్​ గాంధీ  హెచ్చరించారు. త్యాగాల తెలంగాణలో  కేసీఆర్​ ముఖ్యమంత్రిలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని, నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్​ఎస్​ను ఓడిస్తామని, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్​లో జరిగిన ‘రైతు సంఘర్షణ సభ’లో రాహుల్​గాంధీ మాట్లాడారు. సీఎం కేసీఆర్​పై, టీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 టీఆర్​ఎస్​తో పొత్తు ఉండదు

‘‘తెలంగాణకు ధోకా చేసిందెవరు? తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఎవరు? లక్షల కోట్ల రూపాయలు దోచుకుపోతున్నది ఎవరు? ఆ వ్యక్తి పేరేంది? నాకు వినిపించడం లేదు.. చెప్పండి? ఏం పేరు ఆయనది?”అంటూ సభకు హాజరైన ప్రజల నుంచి రాహుల్​ సమాధానం రాబట్టారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఆ వ్యక్తి (కేసీఆర్​)తో గానీ, ఆ పార్టీ (టీఆర్​ఎస్​)తో కానీ కాంగ్రెస్​కు పొత్తు ఉండదన్నారు. ‘‘టీఆర్​ఎస్​తో పొత్తు గురించి కాంగ్రెస్​ లో ఎవరు ఆలోచించినా సహించేది లేదు. ఎంతవారైనా సరే ఆ వ్యక్తితో, ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తే పార్టీ నుంచి పంపించేస్తం. టీఆర్​ఎస్​తో సంబంధాలు ఉన్నోళ్లు ఎవరైనా కాంగ్రెస్​లో ఉంటే.. వాళ్లు టీఆర్​ఎస్​లోకి గానీ, బీజేపీలోకి గానీ వెళ్లిపోవచ్చు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్​కు అవసరం లేదు” అని తేల్చిచెప్పారు.

మనసులో ఏం ఆలోచన వస్తే అదే చేస్తున్నడు

‘‘ఇది మీ రాష్ట్రం. తెలంగాణ ఏర్పాటు అంత సులభంగా జరగలేదు.  రాష్ట్రం కోసం ఇక్కడి యువత, తల్లులు తమ రక్తం, కన్నీరు ధారపోశారు. తెలంగాణ ప్రజలంతా కలిసి పోరాటం చేశారు.. కాంగ్రెస్​ కూడా తెలంగాణ ప్రజలతో పాటు పోరాడింది” అని రాహుల్​ అన్నారు.   కాంగ్రెస్​ పార్టీకి 
రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల కల సాకారానికి సోనియాగాంధీ కృషి చేశారని చెప్పారు. తెలంగాణ ఏ ఒక్కరి కోసమో ఏర్పడలేదన్నారు.

తెలంగాణ వస్తే ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని, రైతులు, కార్మికులు, పేదల సర్కార్​ వస్తుందని అందరం ఆశించామని, కానీ అది జరగలేదని పేర్కొన్నారు. ‘‘ఇక్కడున్న చీఫ్​ మినిస్టర్​ చీఫ్​ మినిస్టర్​లా లేరు. రాజులా తయారయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలించడం లేదు. నియంతృత్వంగా వ్యవహరిస్తున్నరు. సీఎం అంటే ప్రజల కోసం పరిపాలన చేస్తరు. రాజు అధికారం కోసమే ఆలోచిస్తరు. తన మనసులో ఏం ఆలోచన వస్తుందో అదే చేస్తరు. ఇక్కడున్న సీఎం కూడా అదే చేస్తున్నరు’’ అని రాహుల్​ గాంధీ విమర్శించారు. 

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్​ఎస్​కు రెండు సార్లు అధికారం ఇస్తే ప్రజలను మోసం చేసిందని రాహుల్​గాంధీ మండిపడ్డారు. ‘‘ఒక్కసారి కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వండి. రైతులు, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తం” అని అన్నారు. రాష్ట్రంలో  కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వరంగల్​ డిక్లరేషన్​లో పేర్కొన్నట్లు ఎకరాకు పెట్టుబడి సాయం కింద రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఇది వట్టి మాటలు కావు.. ఏ కలతో రాష్ట్రం ఏర్పడిందో.. దాన్ని నెరవేరుస్తాం. మాటను నిలబెట్టుకుంటాం” అని చెప్పారు. ‘‘ఇది డిక్లరేషన్​ మాత్రమే కాదు.. రైతులకు కాంగ్రెస్​ ఇస్తున్న గ్యారెంటీ.  రాష్ట్రంలోని ప్రతి రైతు డిక్లరేషన్​ను చదవాలి” అని కోరారు. 

ప్రజలతో ఉండేవాళ్లకే టికెట్లు

నిత్యం ప్రజలతో కలిసి ఉండేవాళ్లకే కాంగ్రెస్​ పార్టీ టికెట్లు దక్కుతాయని నేతలకు రాహుల్​గాంధీ తేల్చిచెప్పారు. ‘‘ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో.. వారికి మెరిట్​ బేసిస్ లో కాంగ్రెస్​ పార్టీ టికెట్​ వస్తుంది. పార్టీలోని వారు ఎంత వారైనా సరే.. రైతులు, కార్మికులు, పేదల కోసం పోరాటం చేయకుంటే టికెట్​ రాదు” అని అన్నారు. ‘‘రాజు(కేసీఆర్​)తో మేం కలిసి పనిచేయం. ఆయనతో పొత్తు ఉండదు... టీఆర్​ఎస్​ను ఎన్నికల్లో ఓడిస్తాం.. టీఆర్​ఎస్​ను నేరుగా ఎదుర్కొంటాం. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం” అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తిని, రైతులు, యువకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తిని వదిలేది లేదని,  వెంటపడుతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉంటానని, ఎప్పుడు పిలిచినా వస్తానని రాహుల్​ చెప్పారు. భూమండలం ఉన్నంత వరకు బీజేపీతో కాంగ్రెస్ కు పొత్తు ఉండదన్నారు. 

బీజేపీ రిమోట్ సర్కార్ ఇది

తెలంగాణలో బీజేపీ రిమోట్ ప్రభుత్వం నడుస్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ తెచ్చిన నల్ల చట్టాలకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందని ఆయన అన్నారు. ‘‘తెలంగాణలో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి బీజేపీకి లేదు. అందుకే టీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన చేస్తున్నది. అందుకే కేసీఆర్​ ఎంత అవినీతికి పాల్పడినా ఇక్కడికి సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు  సంస్థలు రావడం లేదు” అని పేర్కొన్నారు. రైతులకు తాము అండగా ఉంటామన్నారు. ఆదివాసీలకు 10 రిజర్వేషన్ల కోసం తమ మద్దతు ఉంటుందని చెప్పారు.