పేరు మారిస్తే మూల్యం తప్పదు : రాహుల్ గాంధీ

పేరు మారిస్తే మూల్యం తప్పదు : రాహుల్ గాంధీ
  • పేరు మారిస్తే మూల్యం తప్పదు
  • భారత్​గా పేరు మార్పు నిర్ణయంపై కేంద్రాన్ని తప్పుపట్టిన రాహుల్
  • ప్యారిస్​లో స్టూడెంట్లతో కాంగ్రెస్ ఎంపీ చిట్ చాట్

ప్యారిస్ : ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నందుకు మోదీ సర్కారు ఏకంగా దేశం పేరునే మార్చాలని చూస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండి పడ్డారు. దీనికి వాళ్లు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఫ్రాన్స్‌‌ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం ప్యారిస్​లోని సైన్సెస్ పీవో యూనివర్సిటీ స్టూడెంట్లతో చిట్ చాట్ చేశారు. నిజానికి భారత్ పేరు మంచిదేనని, అయితే, పేరు మార్పు వెనుక కేంద్రానికి దురుద్దేశాలున్నాయని ఫైర్ అయ్యారు. చరిత్రను కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దేశ ఆత్మమీద దెబ్బకొట్టాలని చూసేవాళ్లకు మూల్యం చెల్లించుకునేలా చేస్తామని అన్నారు. ‘‘దేశాన్ని ఇండియా లేదా భారత్ అని రెండురకాలుగా పిలవొచ్చు. అందులో ఏ సమస్యా లేదు. కానీ, మా కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం బీజేపీ పెద్దలకు చికాకు కలిగించినట్టుంది. అందుకే వాళ్లు దేశం పేరు మార్చాలని నిర్ణయించుకున్నరు. ఏదేమైనా, మనకు నచ్చినా నచ్చకపోయినా చరిత్ర చరిత్రే. మోడీ సర్కారు దానిని చెరిపివేయాలని చూస్తున్నది. చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియకుండా చేయాలనకుంటున్నది’’ అని రాహుల్ అన్నారు. 

బీజేపీది అసలైన హిందూయిజమే కాదు.. 

బీజేపీ చేసే పనులకు, హిందూ మతానికి పొంతనే లేదని రాహుల్ అన్నారు. అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుందన్నారు. హిందూ నేషనలిజంపై ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు రాహుల్ జవాబిస్తూ.. హిందూ జాతీయవాదం అనే పదానికి హిందూ మతానికి సంబంధం లేదని చెప్పారు.