అధికారంలోకి వస్తే నీట్ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తం: రాహుల్

అధికారంలోకి వస్తే నీట్  విషయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తం: రాహుల్
  •     తమిళనాడులోని తిరునెల్వేలి ర్యాలీలో రాహుల్

తిరునెల్వేలి: నేషనల్  ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్  టెస్ట్ (నీట్) పేదలకు వ్యతిరేకమని కాంగ్రెస్  నేత రాహుల్  గాంధీ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి నీట్  నిర్వహించే విషయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్  మాట్లాడారు. నీట్ తో తమిళనాడు ప్రజలతో పెద్ద సమస్యే ఉందని తనకు తెలుసన్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని రాష్ట్రాలకే వదిలేస్తామని చెప్పారు. తమ కూటమి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రాడ్యుయేట్లు, డొప్లొమా హోల్డర్లకు లబ్ధి చేకూర్చడానికి పార్లమెంటులో రైట్ టు అప్రెంటిస్ షిప్  చట్టం చేస్తామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి మన దేశం దిక్సూచి ఉండేదని ప్రపంచ దేశాలు అనుకునేవి. ఇప్పుడు మన దేశం ప్రజాస్వామ్య దేశం కాదన్న అభిప్రాయం ఆ దేశాల్లో ఉంది. కరువు సాయం చేయాలని తమిళనాడు అడిగితే భిక్ష అడిగినట్లు చూశారు తప్ప పైసా కూడా సాయం చేయలేదు” అని రాహుల్  వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ శాఖల్లో ఆరెస్సెస్  మనుషులు

కేంద్ర సంస్థలన్నీ ఆరెస్సెస్  మనుషులతో నిండిపోయాయని రాహుల్ ఆరోపించారు. ‘‘ప్రస్తుతం దేశంలో సిద్ధాంతాలపరంగా పోరు జరుగుతున్నది. ఒకవైపు సామాజిక న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం కోసం పోరాటం జరుగుతుంటే మరోవైపు ఆరెస్సెస్ ఐడియాలపై పోరు జరుగుతున్నది. ఒక దేశం, ఒక లీడర్, ఒక భాష కోసం ప్రధాని మోదీ పోరాడుతున్నారు” అని రాహుల్  పేర్కొన్నారు.