- రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నది
- దేశాన్ని కాపాడుకుందాం
- ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేసిండు
- ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డడు
- మోదీ పని కూడా అదే.. ఆయన వచ్చే ముందు ఈడీ వస్తది
- మేం అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు రుణమాఫీ చేస్తం
- పేదింటి మహిళలకు ఏటా రూ. లక్ష ఇస్తామని వెల్లడి
- కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఏ టీమ్ బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘గత సీఎం వేల ఫోన్లు ట్యాప్ చేయించిండు. రెవెన్యూ, ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థలను దుర్వినియోగం చేసిండు. అధికారం పోయినంక ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేయించిండు. ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డడు. ఇక్కడ కేసీఆర్ చేసిందే.. కేంద్రంలో మోదీ చేస్తున్నడు. మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఎక్స్‌టార్షన్‌గా మార్చి బలవంతపు దోపిడీలకు వసూళ్లకు వాడుకుంటున్నడు. అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్ల లిస్ట్ చూస్తే ఇది స్పష్టమవుతుంది” అని పేర్కొన్నారు. శనివారం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతర సభలో కాంగ్రెస్ జాతీయస్థాయి మేనిఫెస్టో ‘న్యాయపత్రం’ను రాహుల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు.
ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద వాషింగ్ మెషీన్‌గా మారిందని, దేశంలోని అవినీతిపరులంతా మోదీతోనే ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ మనుషులున్నారని వ్యాఖ్యానించారు. ‘‘మోదీ 3,4శాతం ఉన్నవాళ్ల కోసం పని చేస్తున్నడు. ఆయన దగ్గర సంస్థలు, సీబీఐ, ఈడీ ఉన్నాయి.. మా వద్ద జనం ప్రేమ, నిజం మాత్రమే ఉన్నాయి” అని తెలిపారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం
‘‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడానికి ఇక్కడికి వచ్చాను. కొన్ని నెలల కింద అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలోనే ఆరు గ్యారంటీలు విడుదల చేశాను. వాటినే జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆవిష్కరిస్తున్నాం” అని రాహుల్‌గాంధీ తెలిపారు. ‘‘రాష్ట్రంలో రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ , గృహలక్ష్మి, ఫ్రీ బస్ టికెట్, మహాలక్ష్మీ స్కీమ్‌లు అమలు చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు తెలుసు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ గ్యారెంటీలు అయితే చెప్పామో వాటిని నిలబెట్టుకున్నాం..ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే.. జాతీయ స్థాయిలోనూ కచ్చితంగా అమలుచేసి తీరుతాం” అని ఆయన అన్నారు. ‘‘ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే కాదు.. దేశ ప్రజల హృదయాల్లోంచి పుట్టినవే మా గ్యారెంటీలు.. ప్రజల గొంతుకగా వారి సమస్యలను తెలుసుకుని, వాటిని మేనిఫెస్టోలో పెట్టాం. జాతీయ మేనిఫెస్టోలోని గ్యారంటీలు ఆత్మలాంటివి” అని రాహుల్ గాంధీ తెలిపారు.
పేదింటి మహిళకు ఏడాదికి రూ.లక్ష
మహిళలు మన భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును చూసుకుంటారని.. ఇంట్లో పిల్లలు, కుటుంబాన్ని, బయట ఆఫీసులు, ఇతర పనుల్లో రెండు విధాలుగా పనిచేస్తున్నారని రాహుల్ చెప్పారు. ‘‘మహిళల కోసం నారీ న్యాయ్ తీసుకువస్తున్నాం. మహిళా న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తాం. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తాం. వాటిని నేరుగా బ్యాంకులోనే జమ చేస్తాం. ఇది ఓ విప్లవాత్మక పథకం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు. ఇది దేశ ముఖచిత్రాన్నే మారుస్తుంది” అని ఆయన వివరించారు.
మనందరిదీ ఆత్మీయ బంధం
‘‘నాకు తెలంగాణ ప్రజలతో ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం. మనందరిదీ కుటుంబ ఆత్మీయ బంధం. మీకు సోనియమ్మ మద్దతు ఉంది. తెలంగాణ ప్రజల సిఫాయిలా ఢిల్లీలో ఉంటా. నా జీవితాంతం చిన్న పిల్లలు పిలిచినా తెలంగాణ వస్తా. ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం. ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపాలి. నేను, సీఎం, కార్యకర్తలు అందరం కలిసి పని చేస్తాం” అని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీకి భయపడం
దేశంలో ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు సృష్టిస్తున్నదని, కొట్లాటలు పెడుతున్నదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ‘‘తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా పనిచేస్తూ తమ ఐక్యతా సందేశాన్ని దేశం మొత్తానికి అందిస్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. దళితులు, ఆదివాసీ, బీసీలు ఇలా అన్ని వర్గాలను రాజ్యాంగం రక్షిస్తున్నది. రాజ్యాంగాన్ని రద్దు చేయనీయం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని బ్యాంకు అకౌంట్లను బీజేపీ మూసేయించింది. అయినా మేం భయపడం” అని ఆయన స్పష్టంచేశారు.
దేశంలో రైతులకు రుణమాఫీ చేస్తం
దేశంలో రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి రూ. 16 లక్షల కోట్లు ధనవంతులకు, వ్యాపారులకు మాఫీ చేశారు.కానీ రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. అందుకే మేము రైతుల కోసం రుణమాఫీ చేస్తాం. రైతులు పండించే ప్రతీ పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించే ఎంఎస్‌పీపై చట్టబద్దత కల్పిస్తాం. కిసాన్ న్యాయ్ ద్వారా స్వామినాథన్ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర ఇస్తాం” అని చెప్పారు. దేశంలోని కార్మికుల కోసం మినిమమ్ వేజెస్ అమలు చేస్తామని, గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు కనీసం రోజుకు రూ.400 ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు.
‘‘దేశంలో 50 శాతం ప్రజలు బీసీలు, 15శాతం దళితులు, 8శాతం ఆదివాసీలు, 15శాతం మంది మైనార్టీలు ఉన్నారు. 5 శాతం నిరుపేదలు జనరల్ కేటగిరీలో ఉన్నారు. మొత్తంగా 90శాతం పేదలే ఉన్నారు. దేశంలో ఏ సంస్థలో చూసినా ఈ 90 శాతం మంది కనిపించరు. దేశంలో 200 బడా కంపెనీలను లిస్ట్ చూస్తే ఒక్క బీసీ, ఒక్క ఎస్సీ, ఎస్టీ, ముస్లీం కనిపించరు. దేశాన్ని నడిపించే ప్రధాన విభాగాల్లో 90 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే ముగ్గురే బీసీలు ఉన్నారు. జనాభాలో ఓబీసీలు 50శాతం.. ఐఏఎస్‌ల్లో ఓబీసీల వాటా 3 శాతమే ఉంది” అని రాహుల్ అన్నారు. దేశంలో రూ.100 ఖర్చు చేస్తే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 6 రూపాయలే ఖర్చు చేస్తున్నారని, 90శాతం ప్రజల దేశంలో హక్కు దారులా కాదా? వారికి భాగస్వామ్యం లేదా అని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పారు. దేశంలో కులగణన చేయిస్తామని, ఎక్స్‌రే తీసినట్లు నీళ్లకు నీళ్లు పాలకు పాలు విడదీసి చూపుతామని తెలిపారు.
"నాకు, తెలంగాణ ప్రజలకు ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం. మనందరిదీ కుటుంబ ఆత్మీయ బంధం. మీకు సోనియమ్మ మద్దతు ఉంది. ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం. ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపాలి"- రాహుల్ గాంధీ