సీఎం భగవంత్ మాన్ను గౌరవిస్తాను కానీ.. : రాహుల్ గాంధీ

 సీఎం భగవంత్ మాన్ను గౌరవిస్తాను కానీ.. : రాహుల్ గాంధీ

గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటనల కోసం పంజాబ్ రాష్ట్ర నిధులను ఖర్చు చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను సీఎం భగవంత్ మాన్ ను గౌరవిస్తాను కానీ ఆయన పంజాబ్‌ను ఢిల్లీ నుండి కాకుండా స్వతంత్రంగా నడపాలని కోరారు. "మీరు లోక్‌సభలో (మన్ ఎంపీగా ఉన్నప్పుడు) నాతో పాటు కూర్చున్నారు. మీకు అరవింద్ కేజ్రీవాల్‌కి మధ్య చాలా తేడా ఉంది. నేను మిమ్మల్ని గౌరవిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ వేదికపై నుండి చెబుతున్నాను. పంజాబ్‌ను ఢిల్లీ నుండి నడపకండి" అని రాహుల్ గాంధీ అన్నారు.  

భారత్ జోడో యాత్రలో భాగంగా పంజాబ్‌లోని ఓ రైతును ఆప్ ప్రభుత్వం గురించి అడిగితే.. ఇది రిమోట్ కంట్రోల్డ్ ప్రభుత్వమని అతని సమాధానం చేప్పినట్లుగా రాహుల్ తెలిపారు. రిమోట్ కంట్రోల్డ్ అంటే ఎంటని తాను తిరిగి ఆ రైతును అడిగితే అతను రాఘవ్ చద్దా(ఆప్ ఎంపీ)  పేరు చెప్పారని రాహుల్ వెల్లడించారు. మాన్ ఎవరికీ రిమోట్ కంట్రోల్‌గా మారకూడదని, రాష్ట్రాన్ని  ఆయనే స్వతంత్రంగా నడపాలని రాహుల్ సూచించారు.  

గురువారంతో పంజాబ్ లో ముగిసిన భారత్ జోడో యాత్ర జమ్మూ కశ్మీర్ లో ప్రవేశించనుంది.  ఈ యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను కవర్ చేసింది.