- అదే సమయంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు: మహేశ్ గౌడ్
- సమిట్‌కు హాజరుకానున్న 70 దేశాల ప్రతినిధులు
- ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామన్న పీసీసీ చీఫ్
న్యూఢిల్లీ, వెలుగు: గిగ్ వర్కర్లతో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజులు పాటు హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే ‘భారత్ సమ్మిట్–2026’తో పాటు ఈ సభ ఏర్పాటు చేయనున్నారు. గిగ్ వర్కర్లతో సభ నిర్వహించాలని రాహుల్ సూచించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాహుల్ దిశానిర్దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. మంగళవారం ఢిల్లీలో జన్‌పథ్ 10లోని నివాసంలో రాహుల్ గాంధీని మహేశ్ కుమార్ గౌడ్ కలిసి భారత్ సమ్మిట్‌కు రావాలని కోరుతూ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పీసీసీ చేపడుతున్న కార్యక్రమాలపై రిపోర్టు సమర్పించారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించిన మెమోరియల్ పార్క్‌కు సంబంధించిన పుస్తకాన్ని రాహుల్‌కు అందించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో ఓబీసీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, హైదరాబాద్‌లో జరగనున్న భారత్ సమ్మిట్, పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ, ప్రభుత్వంలో ఓబీసీల ప్రాతినిధ్యంపై రాహుల్‌తో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలను రాహుల్‌కు వివరించారు. నేతల మధ్య గొడవలు, పంచాయితీలపై సమావేశంలో చర్చ జరగలేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలను పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని తెలిపారు. ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని వెల్లడించారు.
సర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సభ
‘సర్’, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని పీసీసీ గుర్తు చేసింది. ఇదే తరహాలో హైదరాబాద్‌లోనూ సర్‌కు వ్యతిరేకంగా భారీ సభ నిర్వహించనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మెగా బీసీ ర్యాలీకి హాజరుకావాలని రాహుల్‌ను కోరినట్లు చెప్పారు. అయితే ర్యాలీ తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్మన్ సోనియా గాంధీ ఆత్మకథను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో సోనియా ఆత్మకథ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సమ్మిట్‌కు అంతర్జాతీయ ప్రతినిధులు
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సార్వత్రిక ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ అంశాలపై సమ్మిట్‌లో చర్చలు జరుగుతాయన్నారు. గత ఏడాది సమ్మిట్‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారని, ఈసారి కూడా ఆయనతో పాటు ఢిల్లీ నుంచి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరవుతారని చెప్పారు. అంతర్జాతీయ ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొనే ఈ సమ్మిట్ ఒక దిక్సూచిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
