రాజీనామాపై తగ్గని రాహుల్

రాజీనామాపై తగ్గని రాహుల్
  • 12 తుగ్లక్ రోడ్డులో రోజంతా చర్చలు.. పార్లమెంటరీ పార్టీ బాధ్యతకు ఓకే
  • సీనియర్ల కాంప్రమైజ్ ఫార్ములాకు అంగీకరించినట్లు సమాచారం
  • కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం భేటీకానున్న సీడబ్ల్యూసీ
  • రాజీనామా వద్దన్న యూపీఏ పార్టీల నేతలు

లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్లో సమూలంగా మార్పులు చేయాలన్న రాహుల్ గాంధీ ఆలోచన ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. వారసత్వ పార్టీ అన్న ముద్ర చెరిగిపోయేలా, నెహ్రూ ఫ్యామిలీకి చెందని బయటి వ్యక్తికి ఏఐసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న వాదన కూడా నెగ్గినట్లు తెలిసింది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటానన్న రాహుల్ మూడ్రోజులైనా వెనక్కి తగ్గకపోవడంతో.. హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్తో మంగళవారం సీనియర్ నేతలు గంటల తరబడి చర్చలు జరిపారు. నెహ్రూ కుటుంబీకులు లేని కాంగ్రెస్ను ఊహించలేమని తెగేసి చెప్పిన సీనియర్లు.. ఆ మేరకు ఓ కాంప్రమైజ్ ఫార్ములా రూపొందించినట్లు సమాచారం.

పార్టీ బాధ్యతల నుంచి రాహుల్ పూర్తిగా తప్పుకోకుండా ఉంచడమే ప్రధాన ఉద్దేశంగా సీనియర్లు కాంప్రమైజ్ ఫార్ములాను రూపొందించారు. దానిప్రకారం, రాహుల్ కోరినట్లు పార్టీకి కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. అదే సమయంలో లోక్సభలో కాంగ్రెస్ నాయకుడిగానైనా లేదంటే పార్లమెంటరీ పార్టీ నేతగానైనా రాహుల్ బాధ్యతలు స్వీకరించాల్సిఉంటుంది. అయితే కొత్త చీఫ్గా ఎవరుండాలో మీరే సూచించాలని రాహుల్ను హైకమాండ్ కోరినట్లు సమాచారం. కొత్త చీఫ్ ఎన్నిక ప్రక్రియను మూడు నెలల్లోగా ముగించాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. మరోవైపు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాహుల్కు యూపీఏ నేతల నుంచి వినతులువెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ఆత్మహత్యతో సమానమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించగా, రాజీనామా అవసరమేలేదని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సహా ఇంకొందరు ప్రముఖులు వ్యక్తిగతంగా రాహుల్ను వారించే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ చీఫ్గా ఆయనే కొనసాగాలంటూ ఢిల్లీ పీసీసీ తీర్మానం చేసింది.

గతంలోనూ కాంప్రమైజ్ ఫార్ములా

ఇదివరకు కూడా గందరగోళ పరిస్థితి ఎదురైన ప్రతిసారి కాంగ్రెస్ ఇలాంటి కాంప్రమైజ్ ఫార్ములాను అనుసరించింది. 1991లో రాజీవ్గాంధీ చనిపోయిన తర్వాత పార్టీ చీఫ్గా పీవీ నరసింహారావు ఎన్నికయ్యారు. ఆయన ప్రధానమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో.. పార్లమెంటరీ నేతగా కొనసాగుతూ, పార్టీ బాధ్యతలను మాత్రం సీతారాం కేసరికి అప్పగించారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన సమయంలో.. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడు కావడంతో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా సుశీల్ కుమార్ షిండే వ్యవహరించారు. రెండు సభలకు కలిపి సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగారు.

ఈ వారంలోనే సీడబ్ల్యూసీ మీటింగ్?

సీనియర్లు ప్రతిపాదించిన కాంప్రమైజ్ ఫార్ములాకు రాహుల్ అంగీకరించారన్న వార్తలు రావడంతో సీడబ్ల్యూసీ తీర్మానంపై చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ శనివారం సమావేశమైంది. ఆ భేటీలో పలువురు సీనియర్ నేతల తప్పుల్ని రాహుల్ ప్రస్తావించడం, మిగతావాళ్లు సహకరించకపోవడంతో ప్రచార భారం మొత్తం అధ్యక్షుడే మోయాల్సివచ్చిందని ప్రియాంక గాంధీ ఆక్షేపించడం తెలిసిందే. ఈ వీకెండ్లోగా మరోసారి భేటీ కానున్న సీడబ్ల్యూసీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను చేపడతారనే చర్చ నడుస్తున్నది.

రాహుల్ ఇంటికి నేతల పరుగులు

రాజీనామా విషయమై గత మూడ్రోజులుగా గుంభనంగా ఉంటున్న రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం తనను కలవాల్సిందిగా పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో అందుబాటులో ఉన్న నేతలు 12 తుగ్లక్రోడ్డులోని ఇంటికి క్యూ కట్టారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్, ఈస్ట్ యూపీ ఇన్చార్జి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాతోపాటు ఇంకొందరు ముఖ్యనేతలు రాహుల్తో సమావేశమైనవారిలో ఉన్నారు. రాజీనామా చేస్తానన్న రాహుల్ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమన్న సోనియా గాంధీ, ప్రియాంక వాద్రాలు కూడా కాంప్రమైజ్ ఫార్ములాకు సరేనన్నట్లు తెలిసింది.

1998లో సోనియా, ఇప్పుడు రాహుల్

నెహ్రూ ఫ్యామిలీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే విషయమై ఎటూతేల్చుకోలేకపోవడం ఇటీవల ఇది రెండోసారి. 1998లో సోనియా జాతీయతపై ప్రశ్నలు రావడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. అప్పటికే పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉండటం, నెహ్రూ కుటుంబేతర వ్యక్తుల నాయకత్వంలో డిసిప్లిన్ దెబ్బతినడంతో నేతలందరూ పట్టుపట్టి సోనియానే చీఫ్గా ఉండాలని ప్రాధేయపడ్డారు. 15 రోజుల సస్పెన్స్ తర్వాత ఆమె తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ నాయకత్వంపై విమర్శలు పెరగడంతో, పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారన్న వాదన ఉంది. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం రాహుల్ సీరియస్గానే ఉన్నారని అంటున్నారు.