రాహుల్, అమిత్ షా మాటల తూటాలు..

రాహుల్, అమిత్ షా మాటల తూటాలు..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మధ్యన మాటల తూటాలు పేలాయి. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఉత్తరప్రదేశ్ ను చుట్టేస్తున్నారు అమిత్ షా. గత ఎన్నికల్లోలాగానే… ఈసారి కూడా మెజారిటీ సీట్లు గెలిచే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు రాహుల్… కూడా విరిగా రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. ఒడిశాలో పర్యటించిన రాహుల్..బీజేపీ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన MNREGA, RTI, గిరిజన హక్కుల చట్టాలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు రాహుల్ గాంధీ. బుధవారం ఒడిశాలో పర్యటించిన రాహుల్.. భవానీపట్న, రూర్కెలాల్లో పరివర్తన్ సంకల్ప్ సమావేశ్ బహిరంగసభల్లో పాల్గొన్నారు.

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలు దళితులు, ఆదివాసీల భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే కనీస ఆదాయ హామీని అమలు చేస్తామన్నారు రాహుల్. బ్యాంక్ అకౌంట్లలో 15లక్షలు వేస్తామని మోడీలా తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికలు నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలకు మధ్య యుద్ధం అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఉత్తరప్రదేశ్ లో పర్యటించిన అమిత్ షా… అలీగఢ్, బులందషహర్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉత్తరప్రదేశ్ లో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్, SP, BSPలు తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రామజన్మభూమిలోనే మందిర నిర్మాణం జరగాలనేది… బీజేపీ వైఖరిగా చెప్పారు.