పాలమూరు కాంగ్రెస్​ క్యాడర్​లో ఫుల్ జోష్

పాలమూరు కాంగ్రెస్​ క్యాడర్​లో ఫుల్ జోష్
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముగిసిన కాంగ్రెస్  సెకండ్  ఫేజ్  బస్సుయాత్ర

జడ్చర్ల టౌన్/కల్వకుర్తి, వెలుగు: రాహుల్​గాంధీ పాలమూరు పర్యటన కాంగ్రెస్  క్యాడర్​లో ఫుల్ జోష్  నింపింది. రెండు రోజులుగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభల్లో పాల్గొన్న ప్రజలు రాహుల్  పీఎం.. పీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే రేవంత్​రెడ్డి మాట్లాడుతుండగా, రేవంత్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు లీడర్లకు బూస్ట్​ ఇస్తున్నాయి. ప్రజలు కేరింతలు కొడుతున్న ప్రతిసారీ రాహుల్  ప్రతి స్పందించారు.

చిరునవ్వుతో చేయి ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. మంగళ, బుధవారాల్లో కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్​నగర్  నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, కార్నర్ మీటింగ్​లకు రెండు లక్షలకు పైగానే పబ్లిక్  అటెండ్  కావడం ఆపార్టీ రాష్ట్ర నాయకుల్లోనూ ఉత్సహం నింపింది.

ఆప్  సబ్​లోగ్  ఇదర్  ఆయియే..

జడ్చర్ల కార్నర్  మీటింగులో రాహుల్ మాట్లాడుతుండగా, ఆయన ప్రసంగం వినిపించడం లేదని ప్రజలు కేకలు వేశారు. స్పందించిన రాహుల్ ‘ఆప్ సబ్ లోగ్ ఇదర్ అయియే’ అని చేయితో సైగ చేయడంతో ఒక్కసారిగా బారికేడ్లు, పోలీసులను తోసుకుంటూ ప్రజలు ముందుకు వచ్చారు. దీంతో అక్కడున్న పోలీసులు ఖంగు తిన్నారు. ప్రజలు దగ్గరగా రావడంతో బస్సు చుట్టూ పోలీసులు రక్షణగా నిలిచారు. మీటింగ్​కు హాజరైన రామేశ్వరమ్మ అనే వృద్ధురాలిని ఉదాహరణగా చూపిస్తూ రూ.2 వేల పింఛన్​ను తమ ప్రభుత్వం రాగానే రూ.4 వేలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. 

పోలీసుల పటిష్ట భద్రత..

రెండు రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుతున్న రాహుల్ గాంధీ సెకండ్  ఫేజ్  బస్సుయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానంగా 44, 167 హైవేలపై ట్రాఫిక్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. 

కేసీఆర్  పెద్ద పనిమంతుడు!

‘పనిమంతుడు పందిరిస్తే, కుక్క తోక తగిలి కూలినట్లు’ లక్ష కోట్లు పోసి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ మునిగిందని, అన్నారం కుంగిందని పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. పోయినసారి ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్​ను 13 సీట్లలో గెలిపిస్తే ఏం చేయలేదన్నారు. పాలమూరు వలస, గోస అట్లనే ఉందన్నారు. ఈసారి 14 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. పరిశ్రమలు తెచ్చుకుందాం, నీళ్లు పారించుకుందామన్నారు. కరీంనగర్ లో భయపడి పాలమూరు కు వచ్చిన కేసీఆర్​ను పార్లమెంట్ కు పంపిస్తే మనకేం ఇచ్చిండని ప్రశ్నించారు. నీళ్లు పారని పాలమూరు ప్రాజెక్టు, పూర్తి చేయని కల్వకుర్తి అని పేర్కొన్నారు. కల్వకుర్తి నుంచి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని ఢిల్లీకి పంపిన ఘనత మనకుందని చెప్పారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ  కేసీఆర్  పాలైందన్నారు.

మార్పు కోసం కాంగ్రెస్ రావాలి..

తండాలను, గిరిజనులను గుర్తించిన చరిత్ర ఇందిరమ్మదేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణా ఇచ్చిన సోనియమ్మకు ప్రజలు తమ ఓటుతో కృతజ్ఞతలు తెలపాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రం కేసీఆర్ పాలనలో నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్  నేతలు మాణిక్​రావు ఠాక్రే. ఉత్తమ్​కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, బాలాజీ సింగ్, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సైడ్ లైట్స్..

 

  •   కల్వకుర్తి సభకు వేలాదిగా ప్రజలు అటెంట్  కాగా, సభా ప్రాంగణం చిన్నగా ఉండడంతో వేలాది మంది రోడ్లపైనే ఉండిపోయారు.
  •   కల్వకుర్తిలో గొల్లకురుమలు ‘రాహుల్ గాంధీ’ పేరుతో తయారు చేసిన గొంగడిని బహూకరించారు.
  •   మైనార్టీ యువతి పెన్సిల్​తో గీసిన ప్రియాంక గాంధీ ఫొటోను రాహుల్​కు అందజేశారు.
  •   కల్వకుర్తి లీడర్లు రాహుల్​కు నాగలిని బహూకరించారు.
  •   రాహుల్  జడ్చర్ల సమీపంలో ఉన్న ఓ చాయ్ దుకాణం వద్ద ఆగి టీ తాగారు.
  •   జడ్చర్ల కార్నర్  మీటింగ్​లో ప్రసంగం ముగియగానే రాహుల్  జడ్చర్ల, దేవరకద్ర కాంగ్రెస్ క్యాండిడేట్లు జి.మధుసూధన్​రెడ్డి(జీఎంఆర్), జనంపల్లి అనిరుధ్​రెడ్డిలను ప్రజలకు పరిచయం చేశారు.