పెండ్లి ఎప్పుడు చేసుకుంటరు?..రాహుల్​కు కాశ్మీర్ విద్యార్థినుల ప్రశ్న

పెండ్లి ఎప్పుడు చేసుకుంటరు?..రాహుల్​కు కాశ్మీర్ విద్యార్థినుల ప్రశ్న
  • సరైన సమయం వచ్చినప్పుడు చేసుకుంటానన్న ఎంపీ

శ్రీనగర్ : కాంగ్రెస్  ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత  రాహుల్  గాంధీ పెళ్లిపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్నది. చాలా సందర్భాల్లో ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. తాజాగా శ్రీనగర్ లోనూ కొంతమంది కాశ్మీరీ విద్యార్థినులు పెండ్లి ఎప్పుడు చేసుకుంటారని రాహుల్​ను అడిగారు. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన అమ్మాయి దొరికినప్పుడు చేసుకుంటానని ఆయన బదులిచ్చారు. సోమవారం కాశ్మీర్ లో రాహుల్  పర్యటించారు. 

ఈ సందర్భంగా శ్రీనగర్ లో కాశ్మీరీ విద్యార్థినులతో ఆయన ముచ్చటించారు. రాజకీయాలు, విద్య, ఉద్యోగాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో పెండ్లి ఎప్పుడు చేసుకుంటారని, పెండ్లి గురించి మీ అభిప్రాయ ఏంటని  యువతులు అడిగారు. దీనికి ఆయన జవాబు ఇస్తూ ‘‘గత 20, 30 ఏండ్లుగా నాపై ఈ పెండ్లి ఒత్తిడి ఉంది. పెళ్లి గురించి నా అభిప్రాయం చెప్పమంటే వివాహం మంచిదనే అంటాను” అని చెప్పారు. 

అయితే, పెళ్లి చేసుకోవడంపై మీరు ప్లాన్  చేస్తున్నారా అని మరో విద్యార్థిని అడగగా.. ‘‘ప్లానింగ్  అంటూ ఏమీ లేదు” అని రాహుల్  సమాధానం ఇచ్చారు. ఒకవేళ పెండ్లి చేసుకుంటే తమను ఆహ్వానించాలని స్టూడెంట్లు అడగగా.. తప్పకుండా ఆహ్వానిస్తానన్నారు.