వారణాసిలో రాహుల్ భారత్ న్యాయ్​ యాత్ర..

వారణాసిలో రాహుల్ భారత్ న్యాయ్​ యాత్ర..

వారణాసి: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్​సభ నియోజకవర్గం వారణాసిలోకి ప్రవేశించింది. వారణాసిలో రద్దీగా ఉండే గోదౌలి ప్రాంతంలో రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని అన్నారు. ఇండియా ప్రేమతో కూడిన దేశమని, ద్వేషం ఎక్కడా లేదన్నారు. ప్రస్తుతం ఇండియా రెండు భాగాలుగా కనిపిస్తున్నదని, ఒకటి ధనవంతులదని, రెండోది పేదలదని అన్నారు. ఒక సెక్షన్​ మీడియా ప్రధానిని మాత్రమే చూపిస్తున్నదని, దేశంలో రైతులు, కార్మికుల కష్టాలను చూపించడం లేదన్నారు. సభ తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని రాహుల్​ సందర్శించారు. రాహుల్​ యాత్ర బీహార్ నుంచి చందువాలీ వద్ద శుక్రవారం యూపీలోకి ప్రవేశించింది. రాత్రి అక్కడే బస చేసిన రాహుల్.. రెండో రోజు వారణాసిలో పర్యటించారు. యాత్రలో పార్టీ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్, అప్నా దళ్  నేత పల్లవి పటేల్, సమాజ్‌‌‌‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, ఇతర నాయకులు భారీగా పాల్గొన్నారు.  

యాత్ర ఆపేసి హుటాహుటిన వయనాడ్​కు..

 వారణాసిలో పర్యటిస్తున్న రాహుల్​ గాంధీ శనివారం సాయంత్రం అకస్మాత్తుగా యాత్రను ఆపేసి కేరళలోని తన నియోజకవర్గం వయనాడ్​కు బయలుదేరి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం తిరిగి రాహుల్​ ప్రయాగ్ రాజ్​కు చేరుకుని యాత్ర కొనసాగించనున్నారు. వయనాడ్ సమీపంలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ వద్ద ఏనుగు దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడు. వయనాడ్ జిల్లా పరిధిలో గత 17 రోజుల్లో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. ఈ నేపథ్యంలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్, బీజేపీ వయనాడ్ జిల్లాలో శనివారం బంద్  నిర్వహించాయి. పుల్పల్లి టౌన్​లో బంద్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో వయనాడ్ లో పరిస్థితిని సమీక్షించేందుకు రాహుల్ హుటాహుటిన అక్కడికి వెళ్లారు.