
- కాంగ్రెస్ లో సామాజిక న్యాయం వల్లే నాకు మంత్రి పదవి: అడ్లూరి
- గాంధీ భవన్లో ఘనంగా రాహుల్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల గణనకు ఒప్పుకొని గెజిట్ విడుదల చేసిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం గాంధీ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాహుల్ ఆలోచన మేరకే పీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించామని స్పష్టం చేశారు. రాబోయే తరానికి రాహుల్ గాంధీ దిక్సూచి అని చెప్పారు. దేశంలో బడుగు, బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం జరగాలన్నదే ఆయన అభిమతమని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఉండబట్టే తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు.
పీసీసీ ప్రెసిడెంట్ గా మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులుగా పొన్నం ప్రభాకర్, తాను కొనసాగుతున్నామంటే అది సామాజిక న్యాయంతోనే సాధ్యమవుతున్నదని స్పష్టం చేశారు. తనకు ఇంతటి అవకాశం కల్పించిన ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. రాహుల్ బర్త్ డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ లో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గాంధీ భవన్ లో డప్పు వాయిద్యాలతో కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్కూలు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అమేర్ అలీ ఖాన్, పార్టీ నేతలు కుమార్ రావు, మెట్టు సాయి, అనిల్ కుమార్, గజ్జెల కాంతం పాల్గొన్నారు.