పీసీసీకి రాహుల్‌‌ ఎఫెక్ట్‌‌

పీసీసీకి రాహుల్‌‌ ఎఫెక్ట్‌‌

కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగనని రాహుల్ గాంధీ తేల్చి చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ రాష్ట్ర నేతల్లో, కేడర్లో మొదలైంది. రాహుల్ వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ ను యువనాయకత్వం నడిపించింది. ఆయన యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పటివరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో వెలుగు వెలిగిన తెలంగాణ సీనియర్లు సైలెంటయ్యారు. రాహుల్ ఆలోచన మేరకే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మొన్నటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఇప్పుడు సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ స్థాయిలో మధుయాష్కీ, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, పీసీసీలో పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు మరి కొందరు నేతలు క్రియాశీలంగా పనిచేశారు.

గతంలో సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ లో జైపాల్ రెడ్డి, డీఎస్, జానారెడ్డి, పొన్నాల, రేణుకాచౌదరి, సర్వే సత్యనారాయణ, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ లాంటి నేతలు కీలకంగా ఉండేవారు. రాహుల్ వచ్చాక ఈ పరిస్థితి మారింది. దీంతో గతంలో రెండుసార్లు పీసీసీ చీఫ్ గా ఉన్న డీఎస్ పార్టీ మారిపోయి టీఆర్ఎస్ లో చేరారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి సీడబ్ల్యూసీ పదవి ఆశించినా ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవితో సరిపెట్టారు. రేణుకాచౌదరికి గతంలో ఉన్న ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించారు. షబ్బీర్, జానారెడ్డి గతంలో మండలి, శాసనసభా పక్షనేతలుగా ఉన్నా గత ఏడాది అసెంబ్లీ టికెట్ల ఎంపికలో వారి మాటకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అయితే ఇప్పుడు రాహుల్ తప్పుకుంటున్నట్లు తేలిపోవడంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీనియర్లు మళ్లీ క్రియాశీల పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త అధినేత వస్తే రాష్ట్ర పార్టీలో ఎవరికి ప్రాధాన్యం ఇస్తారన్న చర్చ కాంగ్రెస్ నేతల్లో జోరుగా నడుస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్​లో చక్రం తిప్పిన కొప్పుల రాజు..

కొన్నేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కొప్పుల రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ ఆఫీస్ ఇన్​చార్జిగా ఉన్న రాజు తెలంగాణ పీసీసీకి సంబంధించిన నిర్ణయాల్లో అన్నీ తానే అయి పనిచేశారు. ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం, సంపత్, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ లాంటి నేతలకు ఆయనే అండగా నిలిచారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, పార్టీ పదవుల ఎంపికలో ఆయనదే కీలకపాత్ర. సీనియర్లకు ప్రాధాన్యం లేదని వారంతా ఆయనపై మొదటి నుంచీ గరంగానే ఉన్నారు. కొందరు రాజుపై ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఇప్పుడు రాహుల్ తప్పుకోవడం వల్ల ఆయన పాత్ర ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. గతంలోలా ఉండకపోవచ్చని రాష్ట్ర నేతలు కొందరు చెబుతున్నారు. కొత్త అధినేత వచ్చాక ఇప్పుడున్న నాయకత్వం పరిస్థితి అనుమానమేనని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

రాహులే కొనసాగాలంటూ ఈ మధ్య ఏకంగా ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ ముందు ఓయూ నేతలు మానవతారాయ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. రాహుల్ నాయకత్వం ఉంటేనే యువతకు పార్టీ పదవులు, టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారనే వీరంతా ఢిల్లీలో దీక్ష చేసే పరిస్థితి వచ్చింది. రాహుల్ రాకముందు రాష్ట్ర కాంగ్రెస్ లో 60 ఏళ్ల నుంచి 80 ఏండ్ల వయసున్న సీనియర్ల హవానే నడిచిందని వారు గుర్తుచేస్తున్నారు. అప్పటివరకు యువ నేతలకు ప్రోత్సాహమే ఉండేది కాదని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మళ్లీ సీనియర్లకు ప్రాధాన్యం?

రాహుల్ స్థానంలో ఏఐసీసీ చీఫ్ గా మరే సీనియర్ నేత వచ్చినా ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న సీనియర్లు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉందని మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో జైపాల్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, రేణుకాచౌదరి లాంటి వారు మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ లో చురుగ్గా మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ గా కూడా మరొకరిని నియమించడం దాదాపు ఖాయమని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2015 నుంచి పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొనసాగేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. మరోవైపు ఈ పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారు. మండలిలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా తనకు బాధ్యతలు అప్పగిస్తే సిద్ధమంటున్నారు. పార్టీ పగ్గాలిచ్చి స్వేచ్ఛనిస్తే యువనేతలతో కలిసి పార్టీని అధికారంలోకి తెస్తానని రేవంత్ రెడ్డి అగ్రనేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచీ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ స్థానంలో మరొకరు వస్తే పీసీసీ పదవి కోసం తాము చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికొస్తాయని నేతలు భావిస్తున్నారు. మరోవైపు పైకి రాహులే కొనసాగాలని సీనియర్లు అంటున్నా… కొత్త అధినేత వస్తే తమకు ప్రాధాన్యం పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు.

కమలంవైపు కొన్ని చేతులు?

గాంధీ కుటుంబ నాయకత్వం లేని కాంగ్రెస్ చుక్కాని లేని నావ లాంటిదని భావించే కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేకపోవడంతో పాటు ఇప్పుడు గాంధీ కుటుంబం నాయకత్వంలో కూడా లేకపోతే పార్టీ మరింత బలహీనపడుతుందని వారు ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారడమే మేలని అనుకుంటున్నవారు కొందరున్నారు. బీజేపీలో చేరడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఓ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత కూడా బీజేపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ రాజీనామా ఖాయం కావడంతో వీరు పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.