అక్టోబర్ 18 నుంచి మూడు రోజులు రాహుల్,ప్రియాంక పర్యటన

అక్టోబర్ 18 నుంచి  మూడు రోజులు రాహుల్,ప్రియాంక పర్యటన
  • 18న రామప్ప గుడి నుంచి బస్సు యాత్ర స్టార్ట్​
  • అక్కడే బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్​ ప్రకటన
  • 19, 20వ తేదీల్లో కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ముఖ్య నేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంకా గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. కాంగ్రెస్​ ముఖ్యనేతలిద్దరూ 18వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. 18, 19, 20వ తేదీల్లో మూడు రోజుల పాటు ఇక్కడ ఉండనున్నారు. ఇద్దరు కలిసి 18న బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ములుగు, ఉమ్మడి కరీంనగర్​, ఉమ్మడి నిజామా బాద్​ జిల్లాల్లో బస్సు యాత్రల్లో పాల్గొంటారు.  ఈ మేరకు వారి టూర్​ షెడ్యూల్​ను ఆదివారం కాంగ్రె స్​ పార్టీ విడుదల చేసింది. 18న సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లా రామప్ప గుడికి వెళ్లి రాహుల్​, ప్రియాంక ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడే బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు. వాస్తవానికి కొండగట్టు నుంచి యాత్రను ప్రారంభించాలనుకున్నా.. దానిని రామప్పకు పార్టీ నేతలు మార్చారు. అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మహిళా డిక్లరేషన్​ను ప్రకటించనున్నారు. సభ పూర్తికాగానే రాత్రి 7 గంటలకు భూపాలపల్లికి చేరుకుని అక్కడ పాదయాత్ర చేస్తారు.  

వివిధ వర్గాలతో సమావేశాలు

ఈ నెల 19, 20వ తేదీల్లో ఉమ్మడి కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాల్లో నిర్వహించే బస్సు యాత్రలోనూ రాహుల్​, ప్రియాంక పాల్గొంటారు. 19న ఉదయం రామగుండంలో సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ వర్కర్స్​ యూనియన్​, రామగుండం ఎరు వుల ఫ్యాక్టరీ కాంట్రాక్ట్​ ఉద్యోగులతో సమావేశమవుతారు. రామగుండం నుంచి పెద్దపల్లికి చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. రైస్​ మిల్లర్ల అసోసియేషన్​, రైతులతో ఇంటరాక్ట్​ అవుతారు. అదే రోజు రాత్రి 7 గంటలకు కరీంనగర్​కు వెళ్లి పాదయాత్ర చేస్తారు. 20వ తేదీ ఉదయం బోధన్​లో బీడీ కార్మికులు, గల్ఫ్​ వలస కార్మికుల కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత నిజాం షుగర్​ ఫ్యాక్టరీని పరిశీలిస్తారు. సాయంత్రం ఆర్మూర్​కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి నిజామాబాద్​కు చేరుకుని పాదయాత్ర చేస్తారు. 

మూడు విడతలుగా బస్సు యాత్ర: రేవంత్​

మూడు విడతలుగా బస్సు యాత్ర ఉంటుందని రేవంత్​ తెలిపారు. దీనికి విజయభేరి బస్సు యాత్ర అని పేరు పెట్టినట్టు చెప్పారు. 18, 19, 20వ తేదీల్లో సాగే బస్సు యాత్ర తొలి విడత అని పేర్కొన్నారు. రెండో విడత బస్సు యాత్రను దసరా అయ్యాక ఉంటుందని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక మూడో విడత బస్సు యాత్రను నిర్వహిస్తామన్నారు. బస్సు యాత్రల్లో సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ స్థాయి నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు.