రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తం : రాహుల్

రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తం : రాహుల్
  •     మేం అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తం: రాహుల్ 
  •     పేదలను వెలుగు వైపు తీసుకెళ్లేది క్యాస్ట్ సెన్సెసే అని వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని కూకటివేళ్లతో పెకిలిస్తామని కాంగ్రెస్  మాజీ చీఫ్​ రాహుల్  గాంధీ అన్నారు. ఎకనామిక్  మ్యాపింగ్  ఆధారంగా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని ఆయన శనివారం ట్వీట్  చేశారు. తాము చేపట్టబోయే చర్యలతో దేశం రూపురేఖలు మారుతాయని, ప్రతిఒక్కరికీ సరైన రిజర్వేషన్లు, హక్కులు దక్కుతాయని పేర్కొన్నారు. 

అలాగే కులగణన అమలు చేస్తామని, ఈ విషయంపై తాము కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ లో ఆయన వెల్లడించారు. కులగణనతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ‘‘దేశంలో నిజంగా పేదలు ఎవరో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత మంది పేదలు ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటి? నిజంగా కులగణన జరగాల్సిన అవసరం ఉందా అని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? బిహార్ లో నిర్వహించిన కులగణనలో 88 శాతం పేదలు ఉన్నారని తేలింది. 

ఆ పేదలు కూడా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, మైనారిటీలే అని వెల్లడైంది. దేశంలో పేదలు ఎంతమంది ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారో బిహార్ లో నిర్వహించిన కులగణనే నిదర్శనం. దేశంలో పేదలు ఎలాంటి దుర్భర స్థితిలో జీవనం గడుపుతున్నారో కూడా మనకు ఐడియా లేదు. అందుకే మేము అధికారంలోకి వస్తే రెండు చారిత్రక నిర్ణయాలు తీసుకుంటాం. 

అందులో ఒకటి కులగణన, రెండోది ఎకనామిక్  మ్యాపింగ్” అని రాహుల్  గాంధీ చెప్పారు. కులగణన, ఎకనామిక్  మ్యాపింగ్ తో పేదలకు విద్య, వైద్యం అందుతుందని, అభివృద్ధిలో వారు భాగస్వాములు అవుతారని వ్యాఖ్యానించారు. ‘‘కులగణన ప్రజల హక్కు. పేదలను కష్టాల చీకటి నుంచి వెలుగు వైపు తీసుకువెళ్లేది కులగణనే. కాబట్టి క్యాస్ట్  సెన్సస్ కోసం అందరూ గళమెత్తాలి” అని రాహుల్  పేర్కొన్నారు.