
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. ఎస్‌ఐబీలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్(ఎస్‌ఓటీ) చీఫ్ గా ప్రణీత్‌రావు పని చేశారు. ఆయన టీమ్‌లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్‌ఐలు సహా మొత్తం 10 మంది ఉన్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో ప్రణీత్‌రావుకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండేవి
ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్‌రావు అందించిన సమాచారంతో భుజంగరావు, తిరుపతన్నల టీమ్స్ దాడులు చేసేవి. ఈ ఆపరేషన్స్‌లో సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల డబ్బును సీజ్ చేసేవారు. వ్యాపార అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బును సీజ్ చేసి, ఎలక్షన్స్‌తో సంబంధం లేకున్నా సరే హవాలా డబ్బుగా ప్రచారం చేసేవారు.
అలా పట్టుకున్న డబ్బులో కొంత ఈసీకి అప్పగించేవారు. మిగిలిన డబ్బు చేతులు మారేది. ఇలా వివిధ వ్యాపార సంస్థలకు చెందిన రూ.కోట్ల డబ్బును పట్టుకున్నారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు రాష్ట్రంలో వివిధ ఎలక్షన్లు జరిగిన టైమ్ లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, నేతలు, వాళ్లకు దగ్గరగా ఉండే వ్యాపారవేత్తలను టార్గెట్ చేశారు. వాళ్లపై రెయిడ్స్ నిర్వహించారు.