టికెట్ రేట్లు పెంచుతారా ఏంటీ ? : రాళ్ల దాడి వల్ల.. వందే భారత్ కు రూ.55 లక్షలు నష్టం

టికెట్ రేట్లు పెంచుతారా ఏంటీ ? : రాళ్ల దాడి వల్ల.. వందే భారత్ కు రూ.55 లక్షలు నష్టం

వందేభారత్ రైళ్లపై పలుచోట్ల జరుగుతున్న రాళ్ల దాడులపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కీలక ప్రకటన చేశారు. 2019 నుంచి వందేభారత్ రైళ్లపై దాడుల వల్ల ఇప్పటి వరకు రైల్వేశాఖకు రూ.55 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బుధవారం (జులై 26న) పార్లమెంటులో వెల్లడించారు. 

వివిధ చోట్ల వందేభారత్ రైళ్లపై దాడి చేసిన 151 మంది నిందితులను అరెస్ట్ చేశామని పార్లమెంటులో చెప్పారు అశ్విని వైష్ణవ్. రాళ్ల ఘటనల్లో ఏ ఒక్క ప్రయాణికుడికి గాయాలు కాలేదని, చోరీలు వంటి సంఘటనలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. 

ఇలాంటి తరహా ఘటనలు జరగకుండా రైల్వేశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు అశ్విని వైష్ణవ్. ప్రయాణికుల భద్రత కోసం.. రైల్వే ఆస్తులను కాపాడడం కోసం.. ప్రజల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. RPF, GRP పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే ట్రాక్ లకు అనుకుని ఉన్న నివాస ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన పెంచుతున్నామని వివరించారు. మరోవైపు.. అసాంఘిక శక్తుల బారి నుంచి వందేభారత్ రైళ్లను కాపాడుకోవడం కోసం.. తరచూ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని చెప్పారు.