న్యూఢిల్లీ/సికింద్రాబాద్, వెలుగు: తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 8 రైల్వే ప్రాజెక్టులతో దేశంలో రైల్వే రంగం మరింత అభివృద్ధి చెందనుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రధానంగా అసన్‌సోల్ (బెంగాల్) వరంగల్‌ను కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్‌లో రైల్వే నిర్ణయాలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం రైల్వే భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
నూతన కారిడార్‌లో భాగంగా తెలంగాణకు సంబంధించిన జునాగఢ్-, నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి, -పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.7,383 కోట్లతో వచ్చే ఐదేండ్లలో ఈ రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయిందని, డీపీఆర్ కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు.
తెలంగాణలోని సింగరేణి, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బొగ్గు గనులు ఉన్నాయని, వీటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడంలో ఈ కారిడార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కారిడార్ ద్వారా 500– 700 కి.మీ. దూరం తగ్గుతుందని చెప్పారు. మల్కాన్‌గిరి, -పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్ ద్వారా తెలంగాణలో 19.77 కిలోమీటర్లు, ఏపీలో 85.5 కిలోమీటర్ల దూరం ఈ ప్రాజెక్టుతో కవర్ అవుతోందన్నారు. అలాగే ఈ కొత్త రైలు మార్గంతో భద్రాచలం టెంపుల్ వద్ద కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని, దీని వల్ల గుడికి వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
విపత్తుల సమయంలో ఈ లైన్ చాలా బాగా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఇది పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ అని, మొత్తం రెండు లైన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటు అనేక టన్నెల్స్ గూండా ఈ -రైల్వే లైన్ నిర్మాణం జరగనుందన్నారు. కోస్తా ఏరియాలో తుఫాన్లు ఏర్పడినప్పుడు ఈ కారిడార్ సరకు రవా ణా, ట్రైయిన్‌ల మళ్లింపునకు ఉపయోగపడుతుందని.. అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మీదు గా ఈ లైన్ కొనసాగుతుందన్నారు. తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధికి ఈ మార్గం కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
