సికింద్రాబాద్ దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఆందోళనల టైమ్ లో 45 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, 44 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 46 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని వెల్లడించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆదివారం అనురాధ మీడియాతో మాట్లాడారు. ఈ కేసును హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆమె తెలిపారు. ఇక నుంచి స్టేట్ పోలీసులే విచారణ కొనసాగిస్తారని చెప్పారు. ‘‘ఆందోళనకారులు ఈస్ట్ కోస్ట్, దానాపూర్​ ఎక్స్ ప్రెస్​లో స్టేషన్​కు వచ్చారు. శుక్రవారం ఉదయం 8:56 గంటల సమయంలో 300 మంది స్టేషన్లోకి చొరబడ్డారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వాళ్లంతా కర్రలు, రాడ్లతో విధ్వంసం సృష్టించారు. ఆర్పీఎఫ్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పెట్రోల్ పోసి కోచ్​కు నిప్పంటించారు. ఆ టైమ్ లో కాజీపేట్‌‌ నుంచి వచ్చిన రైలులో 4వేల లీటర్ల హెచ్‌‌ఎస్‌‌డీ ఆయిల్, మరో రెండు లోకో ఇంజన్లలో 3వేల లీటర్ల ట్రాన్స్‌‌ఫర్మర్‌‌‌‌ ఆయిల్‌‌ ఉంది. వాటికి మంటలు అంటుకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఈ ఘటనలో మొత్తం 30 కోచ్‌‌లు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ.20 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ దాడిలో మొత్తం 1,500 నుంచి 2 వేల మంది పాల్గొన్నారు” అని వివరించారు. దాడిలో పాల్గొన్న వారందరూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారేనని, వేరే రాష్ట్రాల వారెవరూ లేరన్నారు.

20 రౌండ్ల కాల్పులు... 

మొదట లాఠీచార్జ్ చేశామని.. అయినా ఆందోళనకారులు వినకపోవడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్పీఎఫ్‌‌ పోలీసులు 20 రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. 20 రౌండ్లలో ఒక బుల్లెట్ తగలడంతో రాకేశ్ చనిపోయారన్నారు. మిగిలినవన్నీ గోడలకు, ఇతర ప్రదేశాల్లో పడ్డాయని పేర్కొన్నారు. 12 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఆధ్వర్యంలోనే ప్లాన్ చేసినట్లు గుర్తించామన్నారు. నిందితుల మొబైల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

అభ్యర్థులు కాకుండా మిగతా వాళ్లెవరు? 

రాష్ట్రంలో రన్నింగ్, ఫిట్​నెస్ టెస్టుల్లో పాసై ఆర్మీ ఎగ్జామ్ రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థుల సంఖ్య 2,800. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులందరూ ఆందోళనలో పాల్గొనే అవకాశం లేదు. దాడిలో 2వేల మంది పాల్గొన్నారని అనుకుంటే, అందులో ఎంతమంది అభ్యర్థులు? మిగతా వాళ్లెవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయంపై దృష్టి పెట్టారు. దాడిలో ప్లాట్ ఫామ్ 2 బాగా దెబ్బతింది. ప్లాట్ ఫామ్ 1 వైపు పోలీసులు ఉండడంతో ఆందోళనకారులు అటువైపు వెళ్లలేదు. ఇప్పుడు అక్కడున్న సీసీ కెమెరాలే కీలకంగా మారాయి. దాడికి ప్లాన్ లో 4 వాట్సాప్ గ్రూపులే కీలకంగా మారాయని, వీటి ద్వారానే అందన్నీ కోఆర్డినేట్ చేశారని పోలీసులు గుర్తించారు. ఆ గ్రూపుల అడ్మిన్లు, వాటిల్లోని సభ్యుల వివరాలను సేకరించారు. ఈ వివరాల ద్వారా ఆందోళనలో పాల్గొన్నది ఎవరో తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. అసలు అభ్యర్థులను రెచ్చగొట్టింది ఎవరు? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దాడికి ఐదు రోజుల ముందు నుంచే వాట్సాప్ గ్రూపుల్లో ప్లాన్ జరుగుతుంటే విషయం బయటకు కూడా రాలేదు. దాడి విషయం తెలిసి సైలెంట్​గా ఉన్నోళ్లు కూడా నేరస్తులేనని పోలీసులు అంటున్నారు.