పత్తి, మక్క పంటలకు తిప్పలే..

పత్తి, మక్క పంటలకు తిప్పలే..

హైదరాబాద్‌‌, వెలుగు : వర్షాలు తెరిపి ఇచ్చిన ప్రాంతాల్లో రైతులు.. పంట నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. పంట చేలలో నిలిచిన నీటిని తోడేస్తున్నారు. ఎక్కువ రోజులు నీటిలో మునిగిన పంటల్లో పత్తి, సోయా, మొక్కజొన్న మొలకలు మురిగిపోతున్నాయి. లేత మొలకలు, నెల రోజుల దశలో ఉన్నవి.. అధిక తేమ తట్టుకోలేక దెబ్బతింటున్నాయి. పెసర్లు, మినుములు, సోయా వంటి పంటలు కోలుకోలేని పరిస్థితి. అధిక వర్షాలు, వరదలతో దెబ్బతిన్న లక్షలాది ఎకరాల పంట తిరిగి కోలుకోవడం కష్టంగా మారుతోందని రైతులు బాధపడుతున్నారు. 

లేత చేన్లు కోలుకోవడం కష్టమే..

రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల ఎకరాలకు పైగా సాగైన పంటల్లో.. దాదాపు సగానికి పైగా నెల లోపు పంటలే కావడంతో నష్టం  ఎక్కువగా ఉంటోంది.  లేత దశలో ఉన్న పైర్లు.. నీటి ముంపును తట్టుకోలేక పోతున్నాయని అగ్రికల్చర్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు.  బాగా దెబ్బతిన్న చేన్లను మళ్లీ దున్ని విత్తనాలు వేసుకోవాలంటున్నారు. ఈ సీజన్‌‌లో పత్తి, మక్కలు మాత్రమే మళ్లీ వేసుకునే చాన్స్​ ఉందని చెబుతున్నారు. పెసర్లు, మినుములు, సోయా దెబ్బతింటే.. వాటిని పూర్తిగా తొలగించిన మళ్లీ వాటి స్థానంలో జొన్నలు, సజ్జలు, ఇతర మిల్లెట్స్‌‌, ఆయిల్‌‌ సీడ్స్‌‌ వేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు మరింత పెరుగుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గోదావరి పారే ప్రాంతాల్లో తీవ్ర నష్టం

గోదావరి నది పారే ప్రాంతాల్లో  తీవ్ర నష్టం వాటిల్లింది. నదికి ఆనుకుని ఉండే గ్రామాల్లో 2 కి.మీ మేర వరద నీరు పోటెత్తెంది. దీంతో ఆదిలాబాద్‌‌, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంట చేలన్నీ మునిగిపోయాయి. వరంగల్‌‌, మహబూబాబాద్‌‌, తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల చెరువులు, వాగులకు గండ్లుపడి పంట పొలాలు కొట్టుకుపోయినయి. పత్తి చేలలో బురద, ఇసుక మేట వేసింది. వీటిని తొలగించడం కంటే దున్ని మళ్లీ సాగు చేసుకోవడమే మేలని రైతులు అంటున్నారు. మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరికి మాత్రమే.. పెట్టుబడి నష్టం

ఈ సీజన్‌‌లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో పంట నష్టం తక్కువే ఉంటుందని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. కొన్ని జిల్లాల్లో వరి పొలాల కోసం సిద్ధం చేసిన నార్లన్నీ పూర్తిగా కొట్టుకుపోయాయి. మరికొన్ని జిల్లాల్లో వరి నార్లు ఎరుపు రంగుగా మారాయి. నార్లు బాగున్న చోట.. పొలాలు దున్ని నాట్లను వేగవంతం చేస్తున్నారు. నార్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మాత్రం మళ్లీ మొదటి నుంచి సాగు కోసం సిద్ధం అవుతున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.