
హైదరాబాద్ లో వర్షం మరోసారి దంచికొట్టింది. నగరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ జోరు వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ లో కొన్ని రోజులుగా వర్షాలు ప్రతాపం చూపిస్తున్నాయి. వారంరోజులుగా ప్రతిరోజూ చినుకులు పడుతున్నాయి. నాలుగు రోజుల కింద కురిసిన భారీ వర్షంతో.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ముంపు కష్టాలు తొలగలేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
హైదరాబాద్ లో ఇవాళ కూకట్ పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిలింనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట్, కోఠి, లక్డీకాపూల్, లంగర్ హౌజ్, బోయిన్ పల్లి, అల్వాల్, ఎల్బీనగర్, ఉప్పల్ , చార్మినార్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ సహా.. పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. రోడ్లపై వర్షం నిలిచిపోవడంతో.. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ .. హైదరాబాద్ లో ట్రాఫిక్ , వాన పరిస్థితిని మానిటర్ చేస్తోంది. అవసరమైన చోటకు బృందాలను పంపి సహాయక చర్యలకు సూచనలు ఇస్తున్నారు అధికారులు.
రేపు కూడా వర్ష సూచన
హైదరాబాద్ సహా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి జోరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందనని.. దాని ప్రభావం రాష్ట్రంపైనా ఉందని అధికారులు చెప్పారు.