తెలంగాణలో అకాల వర్షం.. ఏ రైతును కదిలించిన కన్నీరే

తెలంగాణలో అకాల వర్షం.. ఏ రైతును కదిలించిన కన్నీరే

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే దశలో వడగండ్లు కురిసి నష్టాన్ని మిగిల్చింది. మొక్కజొన్న, వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.  పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వరి, మామిడి పంటలకు తవ్ర నష్టం కల్గింది. గాలి దుమారానికి మామిడి పంట నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి బస్తాలు తడవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. 

* కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో వడగండ్ల వాన పడింది. 
* జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి, మల్యాల, కోడి మల్యాల మండలాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి.
* రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. కొనరావుపేట, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, వేములవాడ, విర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో రాళ్ల వర్షం కురిసింది. దీంతో వరి పంటలు దెబ్బతిన్నాయి.
* కొమురం భీం జిల్లా కాగజ్ నగర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. 
* మెదక్ పట్టణంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల  వర్షం కురిసింది. 
* మెదక్ జిల్లాలోని రామయంపేట, నార్సింగ్ మండలాల్లో భారీ వర్షం కురిసింది.కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల ఈదురుగాలులు వీచాయి. 
* మెదక్, హవేలీ ఘనపూర్ మధ్య గాలి దుమారానికి రోడ్డుపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. 
* రామయంపేట, చిన్న శంకరంపేట, పెద్ద శంకరంపేట లో వడగళ్లతో కూడిన వాన పడింది. 
* సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద, సిర్గాపూర్, కంగ్టి, జహీరాబాద్ మండలాల్లోనూ వర్షం కురిసింది. 
* సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట మార్కెట్ లో ధాన్యం తడిచింది. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో వరి కుప్పలు తడిచిపోయాయి. వర్షంలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 
* ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో పిడుగు పడి ఆవులు, ఎద్దులు (10 మృతిచెందాయి) చనిపోయాయి.
* జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన పడింది. నర్మెట్ట, తరిగోప్పుల మండలాలలో భారీ వర్షం కురిసింది.