ఉస్మానియా దవాఖానలో ఎటుచూసినా వరద.. బురద

ఉస్మానియా దవాఖానలో ఎటుచూసినా  వరద.. బురద
  • వార్డుల్లోకి వచ్చి చేరిన వర్షం నీళ్లు, డ్రైనేజీ నీళ్లు
  • బయటకు కొట్టుకొచ్చిన సర్జికల్​ మెటీరియల్​
  • చెరువును తలపిస్తున్న హాస్పిటల్​ పరిసరాలు
  • భయం భయంగా పేషెంట్లు, హెల్త్​ స్టాఫ్​
  • అద్భుతమైన బిల్డింగ్స్​ కట్టిస్తామని సీఎం చెప్పి ఐదేండ్లాయె.. ఇప్పటికీ అతీగతీ లేదు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలోనే పెద్దాసుపత్రి అయిన హైదరాబాద్​లోని ఉస్మానియా​హాస్పిటల్​ ఇప్పుడు చెరువును తలపిస్తోంది. ఎక్కడ చూసినా వర్షం నీళ్లు.. దానికితోడు డ్రైనేజీ నీళ్లు వరదలా పొంగుతున్నాయి. హాస్పిటల్​ మెయిన్​ డోర్ల వద్ద మోకాళ్ల లోతుపైకి నీళ్లు వచ్చి చేరాయి. వార్డుల్లోకి  కూడా భారీగా నీళ్లు రావడంతో పేషెంట్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. బుధవారం కురిసిన వర్షానికి హాస్పిటల్  లోపలి నుంచి వరద ఉప్పొంగింది. దీని వల్ల సర్జికల్​ మెటీరియల్​కూడా బయటకు కొట్టుకొచ్చింది. వర్షం నీళ్లు, మురుగు నీళ్లు కలిసి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయి.

ఇప్పటికే రెండో ఫ్లోర్​మూత

ఉస్మానియా​లోని పాత బిల్డింగ్​ రెండో ఫ్లోర్​ లో ఇటీవల పెచ్చులూడి పడటంతో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకొని డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఫ్లోర్​ను మూసేశారు. ఫస్ట్​ ఫ్లోర్​లోనూ అదే పరిస్థితి ఉంది. దీనిపై ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పానా స్పందన లేకపోవడంతో.. డాక్టర్లు, హెల్త్​ స్టాఫ్​  భయంగానే డ్యూటీ చేయాల్సి వస్తోంది.

ఉన్నతాధికారులకు విషయం చెప్పినం: ఇన్​చార్జి సూపరింటెండెంట్​

భారీ వర్షం కురువడంతో నీరు వచ్చిందని, అయితే బేగంబజార్​ నుంచి బయటకు వెళ్లాల్సిన డ్రైనేజీ పైపులైన్ ఉస్మానియా లోపలి నుంచి ఉందని హాస్పిటల్​ ఇన్​చార్జి  సూపరింటెండెంట్ డాక్టర్​ పాండురంగనాయక్ చెప్పారు. ఆ డ్రైనేజీ జామ్​ కావడంతోనే మురుగు నీరు వచ్చిందన్నారు. పేషెంట్లకు  ఇబ్బంది లేకుండా చర్యలు  తీసుకుంటున్నామని, వారిని ఇతర వార్డులోకి తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నామని వివరించారు. ఇక్కడి పరిస్థితిని  ఉన్నతాధికారులు చెప్పామని, జీహెచ్​ఎంసీ ఆఫీసర్లు  వెంటనే స్పందించి  డిజాస్టర్​ టీమ్​ను పంపించి సహాయక చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు.

సీఎం హామీ ఇచ్చి ఐదేండ్లాయె

సీఎం కేసీఆర్​ ఐదేండ్ల కింద ఉస్మానియాకు వచ్చి త్వరలో అద్భుతంగా బిల్డింగ్​లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఇక్కడే టవర్స్ నిర్మించి ఒకే చోట వేలాది మందికి ట్రీట్​మెంట్​అందించేలా చూస్తామన్నారు. నాటి నుంచి నేటికి ఉస్మానియాలో ఎలాంటి మార్పు లేదు. ఐదేండ్ల కింద వచ్చిన సీఎం మళ్లీ ఇంతవరకు ఉస్మానియా దిక్కు చూడలేదు. నీరు చేరిన గ్రౌండ్​ ఫ్లోర్​లోని వార్డుల్లో గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నవారితో పాటు ఇతర పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలుంటాయని ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడి సీన్ ను చూస్తే  పొంతన ఉండటం లేదని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగం నయం చేసుకుందామని హాస్పిటల్​కు వస్తే ఇంకా రోగం ఎక్కువయ్యేలా ఉందని ఆవేదన చెందుతున్నారు.

గ్రౌండ్​ ఫ్లోర్​లో భయం భయంగా..!

గ్రౌండ్​ ఫ్లోర్​లో ఎక్కడికక్కడ వర్షం నీళ్లు, డ్రైనేజీ నీళ్లు చేరాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఫ్లోర్​లోని పేషెంట్లను ఎవరూ పట్టించుకోలేదు. ట్రీట్​మెంట్​ అందక, అన్నం పెట్టే దిక్కులేక పేషెంట్లు, వారి అటెండెంట్లు ఒకే బెడ్​పై బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సి వచ్చింది. వారిని సాయంత్రం ఫస్ట్  ఫ్లోర్​లోకి షిఫ్ట్ చేశారు. అప్పటికే అక్కడ 100 మంది పేషెంట్లు ఉండటంతో అందులోకి మిగతా 40 మంది పేషెంట్లను చేర్చడం ఇబ్బందిగా మారింది.

 

కరోనా ఫెయిల్యూర్స్ పై సర్కార్ అలర్ట్