సిటీలో దంచికొట్టిన వాన.. రాజేంద్రనగర్‌లో హయ్యెస్ట్ 11 సెం.మీ

సిటీలో దంచికొట్టిన వాన.. రాజేంద్రనగర్‌లో హయ్యెస్ట్ 11 సెం.మీ

హైదరాబాద్​, వెలుగు:గ్రేటర్​ సిటీలో సోమవారం ఉదయం నుంచి రాత్రి దాకా  ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా, కాలనీలు, బస్తీల్లోని గల్లీలు చెరువులను తలపించాయి. మెయిన్​ రోడ్లపై వరద నిలిచిపోగా ట్రాఫిక్​ జామ్​లు అయ్యాయి.  వాన పడుతున్న కొద్దీ సుమారు150 ఏరియాల్లో  వరద పెరుగుతుండగా రాత్రి పూట స్థానికులు భయాందోళన చెందారు. రాజేంద్రనగర్​లో అధికంగా 11 సెం.మీ, తక్కువగా నాంపల్లిలో 7.0 సెం.మీ నమోదైంది. పెద్ద అంబర్​పేట్ లోని హనుమాన్​నగర్​, నాగోల్​లోని అయ్యప్ప కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరగా బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. బేగంపేట్​లోని మయూరి మార్గ్​, ఖైరతాబాద్​లోని ఎంఎస్​ మక్తా, బోడుప్పల్​ లోని రామ్ రెడ్డి నగర్, సరూర్ నగర్ లోని కోదండరాం నగర్, సీసల బస్తీ తదితర ప్రాంతాల్లో  జనం ఇబ్బందులు పడ్డారు. హైటెక్​ సిటీ, సికింద్రాబాద్​, మాదాపూర్​, బంజారాహిల్స్​, టోలీచౌకీ, అత్తాపూర్  మెయిన్​ రోడ్లపై వరద నిలిచిపోయింది. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి బల్దియాకు 312 ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కువగా వాటర్​ లాంగింగ్​కి సంబంధించే ఉన్నాయి. మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్​ (11.5  నుంచి 20.4 సెంటి మీటర్ల వరకు)  ప్రకటించింది. 

బల్దియా సిబ్బందికి సెలవులు రద్దు  

భారీ వానల నేపథ్యంలో బల్దియా అలర్టై సిబ్బందికి మూడు రోజులు సెలవులు రద్దు చేసింది. 24  గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గతేడాది వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో హై అలెర్ట్​ ప్రకటించింది.  పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రచారం చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని జనం అప్రమత్తంగా ఉండాలని కోరింది. 

అలర్ట్​గా ఉండాలె: మేయర్

 భారీ వానలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుం డా జనం జాగ్రత్తగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి  సూచించారు. సోమవారం హెడ్డాఫీసులోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో  మీడియా సమా వేశం నిర్వహించారు. వాతావరణ శాఖ సూచన మేరకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేం దుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏ అవసరమైన కంట్రోల్​ రూమ్​ నంబర్​కు ఫోన్​ చేయాలని కోరారు. 

సిటీలో వర్షపాత నమోదు 
ఏరియా                             సెంటీమీటర్లు
రాజేంద్రనగర్​                         11.1
శివరాంపల్లి                            9.7
చార్మినార్​                              8.0
శేరిలింగంపల్లి                          7.8
బీహెచ్ఈఎల్​                         7.8
మాదాపూర్                           7.6
చర్లపల్లి                                  7.4
కాప్రా                                     7.4
ఆసిఫ్ నగర్​                            7.3
బంజరాహిల్స్​                         7.3
నాంపల్లి                                 7.0