‘నైరుతి’కి లైన్​క్లియర్ : వానలు మొదలైనయ్..!

‘నైరుతి’కి లైన్​క్లియర్ : వానలు మొదలైనయ్..!

హైదరాబాద్‌, వెలుగు: నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు లైన్​ క్లియర్​ అవుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిరోజులుగా బీహార్, విదర్భ, తెలంగాణ, దక్షిణ తమిళనాడులో కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తుండటం రుతు పవనాల విస్తరణకు అడ్డుగా ఉందని, ఈశాన్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడటంతో వడగాడ్పులు తగ్గుతాయని వెల్లడించింది. దీంతో రుతుపవనాలు ముందుకు కదులుతాయని తెలిపింది. శని, ఆదివారాల్లో కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ కొంకణ్, గోవా, బెంగాల్, ఏపీ, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేసింది. శనివారం నుంచి కర్నాటకలో తీర ప్రాంతాలు, కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఛత్తీస్‌గఢ్, కొంకణ్, గోవా, ఏపీ తీరం, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్రవారం కూడా వానలు పడితే శనివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ప్రకటిస్తారని వాతావరణ కేంద్రం తెలిపింది.

వానలు మొదలైనయ్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం పడింది. పెద్దపల్లి జిల్లాలోని భోజన్నపేటలో 13,2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగాం జిల్లా కూనూర్‌లో 10.4, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరి, రేగొండల్లో 8.5, భూపాలపల్లిలో 8.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.

ఎండలూ మండుతున్నయి

ఓవైపు వానలు పడుతుండగానే మరోవైపు ఎండలూ మండిపోతున్నాయి. కొన్నిచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. రామగుండంలో అత్యధికంగా 41 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. హైదరాబాద్​లోనూ గురువారం 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 4 డిగ్రీలు ఎక్కువ. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆదిలాబాద్‌, భద్రాచలం, ఖమ్మం, రామగుండంలలో 31 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది.