ఆగని వాన..రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

ఆగని వాన..రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణా శాఖ తెలిపింది. పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయన్నారు వాతావరణ అధికారులు. దీని ప్రభావంతో ఈనెలలో సాధారణ వర్షం కానీ, అంతకంటే ఎక్కువ కురిసే చాన్స్ ఉందన్నారు.

హైదరాబాద్ లో ముసురు కంటిన్యూ అవుతోంది. రాత్రి నుంచి కొన్నిచోట్ల మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. దాంతో రోడ్ల మీద, బస్తీల్లో నీళ్లు నిలిచాయి. హైదరాబాద్ లోని కొన్నిచోట్ల రాత్రి భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. పఠాన్ చెరులో 3 సెంటిమీటర్లు, BHEL లో 2 సెంటిమీటర్లు, RC పురంలో 2 సెంటిమీటర్ల వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, బాల్ నగర్ లో 2 సెంటిమీటర్ల వాన పడింది. 

జిల్లాలోనూ రాత్రి కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో అత్యధికంగా 11 సెంటిమీటర్ల వాన పడింది. మహబూబాబాద్ లో 11 సెంటిమీటర్లు, కుమ్రంభీం జిల్లాలో 11 సెంటిమీటర్లు, మెదక్ జిల్లా ధర్మారంలో 10.7 సెంటిమీటర్లు, సిద్దిపేట జిల్లా శనిగారంలో 10 సెంటిమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కొల్లూరులో 10 సెంటిమీటర్లు, వరంగల్ అర్బన్ జిల్లా మర్రిపల్లిగూడెంలో 10సెంటిమీటర్లు వాన పడింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో 9 సెంటిమీటర్లు, మెదక్ జిల్ల నర్సాపూర్ లో 9 సెంటిమీటర్ల వర్షం పడింది. మంచిర్యాల జిల్లా తాండూరులో, ఖమ్మం జిల్లా పంగిడిలో, నిర్మల్ లో 9 సెంటిమీటర్ల వాన కురిసింది.