వానలు, వరదలు ఉన్నా పునరావాస కేంద్రాలు ఎత్తేస్తున్నరు

వానలు, వరదలు ఉన్నా పునరావాస కేంద్రాలు ఎత్తేస్తున్నరు
  • వానలు, వరదలు ఉన్నా పునరావాస కేంద్రాలు ఎత్తేస్తున్నరు
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అన్ని సెంటర్ల మూసివేత

భద్రాచలం/ జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: “ఈ నెల 29 వరకు వానలు ఉన్నయి.. మళ్లీ వరదలు వస్తయి.. ఎవరూ పునరావాస కేంద్రాలను విడిచి వెళ్లొద్దు.. మీకు ఇక్కడే అన్ని వసతులు కల్పిస్తం.. మంచి  భోజనం పెడతం...” ఇదీ గోదావరి వరద ప్రభావిత భద్రాచలం దాని  చుట్టుపక్కల ముంపు గ్రామాల ప్రజలకు సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ఇచ్చిన హామీ. కానీ ఇవన్నీ వట్టిమాటలే అయ్యాయి. ఆఫీసర్లు ఒక్కో పునరావాస కేంద్రాన్ని ఎత్తివేస్తుండడంతో నిర్వాసితులు భయంభయంగా ఇండ్లకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఇండ్లలోని వస్తువులన్నీ కొట్టుకపోయాయని, మళ్లీ వరద వస్తే ఈసారి తమ ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు షెల్టర్లలో ఉన్న బాధితులకు బుక్కెడు బువ్వ కూడా దొరకడం లేదు. 

పునరావాస కేంద్రాల ఎత్తివేత

వరద బాధితుల కోసం భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నారు. 6వేల మందికి భద్రాచలంలో ఆర్​అండ్​బీ ఆఫీస్, ఐటీడీఏలోని గిరిజన అభ్యుదయ భవన్, మార్కెట్ యార్డు, నన్నపనేని మోహన్​జడ్పీహెచ్​ఎస్ స్కూల్, ట్రైబల్​ బీఎడ్​కాలేజీ, ట్రైబల్ జూనియర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అంబసత్రం, ఎస్సీ హాస్టల్​లో షెల్టర్​ ఇచ్చారు. ఈ నెల 29వరకు వీటిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ కూడా సూచించారు. మంత్రి, కలెక్టర్ కూడా కేంద్రాలను కొనసాగిస్తామని చెప్పారు. కానీ శుక్రవారం నాటికి ఆర్​అండ్​బీ ఆఫీస్, గిరిజన అభ్యుదయ భవన్, మార్కెట్ యార్డులోని సెంటర్లను ఎత్తివేశారు. మొదట్లో ఒక్క భద్రాచలంలోని తొమ్మిది షెల్టర్​హోమ్​లలో ఆరువేల మంది ఉండగా, శనివారం నాటికి 2800 మంది మాత్రమే మిగిలారు. శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ జూనియర్​ కాలేజీ పునరావాస కేంద్రానికి అన్నం రాగానే వందలాది మంది బాధితులు భోజనం కోసం ఒక్కసారిగా ఎగపడ్డారు.
 
రెండు జిల్లాల్లో 83 సెంటర్లు.. 

భూపాలపల్లి జిల్లాలో 31 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2,614 మందికి ఆశ్రయం కల్పించారు. ములుగు జిల్లాలో 52 కేంద్రాల్లో 4,766 మందికి ఆశ్రయం కల్పించారు. కానీ ఈ 83 సెంటర్లను ఇప్పటికే ఎత్తేశారు. వరదలు తగ్గడంతో బాధితులంతా ఇండ్లకు వెళ్లిపోయారని, అందుకే సెంటర్లు ఎత్తేశామని ఆఫీసర్లు చెబుతున్నారు.

మళ్లీ మునిగిన కాలనీ.. 

ఇరిగేషన్​ శాఖ నిర్లక్ష్యం వల్ల భద్రాచలం పట్టణంలోని అశోక్​నగర్ కొత్త కాలనీ మళ్లీ నీటమునిగింది. గోదావరి వరద తగ్గడంతో కొత్తకాలనీ పక్కనే ఉన్న కరకట్ట స్లూయిజ్ గేట్లు ఎత్తి ఉంచారు. శుక్రవారం రాత్రి నుంచి గోదావరి వరద పెరగడం మొదలై శనివారం పొద్దునకల్లా 45.90 అడుగులకు చేరుకుంది. కానీ స్లూయిజ్ గేట్లను కట్ట వద్ద కాపలా ఉండే లష్కర్లు గేట్లు ఎత్తి అడ్డగోలుగా దించేయడంతో అవి కాస్తా ఇసుక బస్తాలపై పడ్డాయి. దీంతో గేటు కింద నుంచి నీరు ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి కొత్త కాలనీలోని 75కు పైగా ఇళ్లను ముంచెత్తింది.