కాళేశ్వరంలో గాలివాన బీభత్సం

కాళేశ్వరంలో గాలివాన బీభత్సం
  • భారీ వర్షంతో కూలిన టెంట్లు, చలువపందిళ్లు
  • బురదమయంగా మారిన పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లు
  • ఏడో రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మహదేవ్‌‌పూర్‌‌, వెలుగు : కాళేశ్వరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో టెంట్లు, చలువ పందిళ్లు, ప్రచార బోర్డులు, విద్యుత్‌‌ లైట్లు అమర్చిన స్టాండ్లు కూలిపోయాయి. పార్కింగ్‌‌ ప్లేస్‌‌లన్నీ బురదమయంగా మారడంతో వాహనాలను బయటకు తీసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జేసీబీ సాయంతో లాగుతూ ఒక్కో వాహనాన్ని బయటకు తీశారు.

బలమైన గాలులు వీయడంతో ఫ్లెక్సీలు, బ్యానర్లు కిందపడిపోవడంతో వెహికల్స్‌‌ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  విద్యుత్‌‌‌‌ లైట్లు అమర్చిన స్టాండ్లు పడిపోవడంతో కరెంట్‌‌‌‌ సరఫరా నిలిచిపోయింది. కలెక్టర్‌‌ రాహుల్‌‌శర్మ స్వయంగా తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ రోడ్లపై గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా స్టోన్‌‌ డస్ట్‌‌ పోయాలని ఇంజినీర్లను ఆదేశించారు. భక్తులకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అలర్ట్‌‌గా ఉండాలని సూచించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఆఫీసర్ల సూచనలు పాటించాలని చెప్పారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాక

సరస్వతి పుష్కరాల ఏడో రోజైన బుధవారం భక్తులు భారీ సంఖ్యలో కాళేశ్వరానికి తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం నదిలో దీపాలు వెలిగించి చీరె, సారెను సమర్పించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.