
- ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లు అతలాకుతలం
పెషావర్/లాహోర్: పాకిస్తాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్సుల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం చాలాచోట్ల ఇండ్లు కూలిపోయాయి. ఈ ఘటనల్లో కనీసం 11 మంది చనిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 47 మంది గాయపడ్డారు. వాళ్లను ఆస్పత్రులకు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ ఆదేశించారు. ప్రావిన్స్‌లోని పెషావర్, మార్దాన్, వజిరిస్తాన్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 30 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు భారీ వర్షాలతో పంజాబ్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. సింధు, చినాబ్, రావి, సట్లేజ్, జీలం నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత జిల్లాల నుంచి 20 వేల మందిని అధికారులు సేఫ్ ప్లేస్‌కు తరలించారు.