పంటలకు ఊపిరి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వానలు

పంటలకు ఊపిరి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వానలు
  • బీటలు వారిన వరి పొలాలకు జీవం 
  • మొక్కజొన్న, సోయాబిన్​కు మేలు 
  • బోర్లలో పెరుగుతున్న భూగర్భ జలాలు​

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరిపోశాయి. గత నెలాఖరులో వానలు పడి ముఖం చాటేయడంతో  రైతులు ఆందోళనకు గురయ్యారు. జూన్​లో మృగశిరకార్తెకు ముందు వర్షాలు పడుతాయని వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగించారు. వరి నాట్లు, ఆరుతడి పంటలు వేశారు. చినుకు జాడ లేకపోవడంతో ఆందోళన చెందారు. బోర్లల్లో నీరు లేక వరి నాట్లు వేసిన పొలాలు బీటలువారే స్థితికి వచ్చాయి.  

జిల్లాలో ముందే వరి నాట్లు.. 

నిజామాబాద్ ​జిల్లాలో ఈ వానాకాలం 5.60 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. వరి పంట 4.32 లక్షల ఎకరాల్లో సాగైంది. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని బోధన్ రెవెన్యూ డివిజన్, రూరల్ సెగ్మెంట్ రైతులు ఇతర ప్రాంతాలకంటే ముందే నారుమడులు పోశారు.

  మే 28 నుంచి నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు నాట్లు  ప్రారంభించగా, జూన్​ 25 నాటికి 95 శాతం ముగిశాయి. వరితో పాటు మొక్కజొన్న 47,678 ఎకరాలు, సోయాబిన్ 37,859 ఎకరాలు, పత్తి 1,332 ఎకరాలు, 855 ఎకరాల్లో కంది, 514 వేరు శనగ, 3,56 ‌‌‌‌‌‌‌‌ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేశారు.  జూన్ 26 నాటికి జిల్లాల్లో సగటు వర్షపాతం 146 ఎం.ఎం ఉంది. ఆ తర్వాత జూన్​ 30, జూలై 2, 7న ఆయా మండలాల్లో కురిసిన వర్షాల తర్వాత పెద్దగా వానలు లేవు. 

తగ్గిన భూగర్భ జలాలు..

వర్షాకాలం మొదలైనప్పటికీ చెరువులు, కుంట్లల్లోకి పెద్దగా నీరు చేరలేదు. జిల్లాలో 1,83,079 లక్షల బోర్లు ఉండగా, ఎండాకాలంలో 10-20 మీటర్ల లోతుకు మించి  గ్రౌండ్​ వాటర్ పెరుగలేదు. ఈ నెల రోజుల్లో మరింత లోతుకు పడిపోయాయి. నిజాంసాగర్ నుంచి ఒక విడత 1.25 టీఎంసీల నీటిని రిలీజ్ చేసినా సాగు నీటి కొరతతో వరి పొలాలు నెర్రెలుబారే స్థితికి వచ్చాయి. 

మొక్కజొన్న, సోయాబిన్ ఇతర పంటలు నీటి కొరత ఏర్పడింది. లిఫ్టులు స్టార్ట్​ చేసే లెవల్ నీరు గోదావరి నదిలో ఇంకా రాలేదు. వారం దాటితే గడ్డు స్థితి వస్తుందని భయపడుతన్న సమయంలో కురిసిన వానలు పంటలకు జీవం పోశాయి. 23న జిల్లాలో 1,399 ఎం.ఎం, 24న 1,244 ఎం.ఎం, 25న 350 ఎం.ఎం వర్షం కురిసింది. బోర్లు నడుపాల్సిన అవసరం లేక బంద్ పెట్టారు. ఈ వానలతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది.

18 ఎకరాల వరి పోయేది..

18 ఎకరాలు కౌలుకు తీసుకొని సొంత భూమి కలిపి మొత్తం 32 ఎకరాల్లో వరి పంట వేసిన. వర్షాలు లేక బోర్లతో పంటకు నీరిందించిన. నెల నుంచి వాటిని ఆపకుండా నడుపడంతో తొమ్మిది బోర్లు ఎత్తేసే స్టేజ్​కు రావడంతో కలవరపడ్డ. వర్షాలు కురువడంతో ధైర్యం వచ్చింది. - రాజలింగం రవి, రైతు, కోస్లి  గ్రామం

వరి పంట బయటపడినట్టే..

నెల నుంచి వానలు లేక నాలుగెకరాల వరి పొలం నెర్రెలు బారింది. రెండు బోర్లలో నీళ్లు తగ్గాయి.  పంట నష్టపోయినట్లేనని ఆందోళన చెందిన. కురిసిన వర్షం పంటను కాపాడింది. గోదావరిలో నీటి మట్టం పెరుగడం సంతోషంగా ఉంది. - బేగరి సాయిలు, రైతు, యంచ