రెయిన్ అలర్ట్: అవసరమైతేనే బయటికి రండి

రెయిన్ అలర్ట్: అవసరమైతేనే బయటికి రండి

హైదరాబాద్లో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి బాటసింగారం పండ్ల మార్కెట్ కు వరద పోటెత్తింది. దీంతో వరదల్లో భారీగా ఆరెంజ్ ఫ్రూట్స్ కొట్టుకుపోయాయి. అనుకోని వరదలతో పండ్లు కొట్టుకుపోవడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం కొత్తపేట పండ్ల మార్కెట్ ను తరలించి కోహెడ సమీపంలోని బాటసింగారంలో ఏర్పాటు చేశారు. నగరం నుంచి పండ్ల మార్కెట్ తరలించొద్దని పలుసార్లు వ్యాపారులు ఆందోళన చేశారు. ప్రస్తుతం కొత్తపేటలో టిమ్స్ నిర్మాణం చేపడుతుండటంతో పండ్లమార్కెట్ ను నగర సరిహద్దుకు తరలించారు. సరైన సౌకర్యాలు లేవని అనేకసార్లు వ్యాపారులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో భారీ వర్షానికి కూడా మార్కెట్ లోని షెడ్డులు ఎగిరిపోయాయని వ్యాపారులు వాపోయారు.

మెట్రో, బస్సుల్లో వెళ్లడం సేఫ్

భారీ వర్షాల దృష్ట్యా సిటీ ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం ఆగిపోయిన వెంటనే.. రోడ్లపైకి రావొద్దన్నారు అధికారులు. ఆఫీసులు, స్కూల్స్, కాలేజ్ లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్లపైకి రావొద్దని.. గంట తర్వాతే ట్రావెల్ చేయాలని సూచించారు. సొంత వాహనాల కంటే మెట్రో, బస్సుల్లో వెళ్లడం సేఫ్ అని తెలిపారు. భారీ వర్షాలతో సిటీలోని రోడ్లపైకి వచ్చిన నీరు పోయేందుకు గంటకు పైగా టైం పడ్తుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుందన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తున్నాయన్నారు అధికారులు.

పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వెదర్ మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచి వాన పడ్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, అంబర్ పేటలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ కంటిన్యూ అవుతోంది.

తెల్ దేవరపల్లిలో 6 సెంటీమీటర్ల వర్షం

నల్గొండ జిల్లాలోని తెల్ దేవరపల్లిలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షం పడగా... కరీంనగర్ జిల్లాలలో 5.4 సెంటీ మీటర్లు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, మేడిపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లె, నిర్మల్ జిల్లా వాద్యాల్లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.