నేడూ భారీ వర్షాలు పడే అవకాశం

నేడూ భారీ వర్షాలు పడే అవకాశం
  • పొద్దట్నుంచి రాత్రి దాకా జోరు వాన..
  • నీట మునిగిన కాలనీలు... చెరువుల్లా మారిన రోడ్లు
  • గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. కొన్ని ఏరియాలకు కరెంట్​ కట్​
  • నిండు కుండలా హుస్సేన్​సాగర్​
  • నేడూ భారీ వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్​లో వర్షం దంచి కొట్టింది. ఉదయం చిన్నగా మొదలైన వాన మధ్యాహ్నం తీవ్రంగా మారింది. రాత్రి వరకు ఆగకుండా వాన పడుతూనే ఉంది. ఎడతెరిపిలేని వర్షంతో సిటీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఏరులై పారుతున్న వరద నీటితో ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఉండిపోయారు. భారీ వర్షాల కారణంగా జనం రోడ్లపైకి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. వాతావరణ శాఖ శుక్రవారం ఉదయమే ఎల్లో అలర్ట్​ ప్రకటించింది. గ్రేటర్​ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్ గిరితోపాటు శివారు జిల్లా అయిన వికారాబాద్​లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్​ నాగరత్నం తెలిపారు. వచ్చే 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఆమె చెప్పారు. 

చెరువులా మారిన నర్సాపూర్​ రోడ్డు

కుత్బుల్లాపూర్​లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.  సూరారం వద్ద  నర్సాపూర్ రహదారి చెరువును తలపించింది. రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో గంటల కొద్ది ట్రాఫిక్ ​స్తంభించింది. ఆరు కిలోమీటర్ల పరిధిలో  ఉన్న రోడ్డులో మూడు నాలుగు చోట్ల కల్వర్టులను మూసి నిర్మాణాలు చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రసూన నగర్, మల్లికార్జున నగర్, వాణినగర్, ఇంద్రసింగ్ నగర్, సుభాష్​నగర్​​ జలమయమయ్యాయి. నాలాల్లో పూడిక తీయకపోవడంతో ఆ నీరంతా నివాస ప్రాంతాలకు పోటెత్తింది. సూరారం లక్ష్మీనగర్ నుంచి శ్రీరాంనగర్ కు వెళ్లే దారికి ఇరువైపులా నీరు చేరడంతో  రోడ్డు కొట్టుకుపోయింది. 

ఐటీ కారిడార్ అస్తవ్యస్థం

ఐటీ కారిడార్​లోని మాదాపూర్,​ శిల్పారామం, హైటెక్స్​ కమాన్​, ఇమేజ్​ హాస్పిటల్​, సీఓడీ జంక్షన్, బాటా షోరూం, నెక్టార్​ గార్డెన్, కొత్తగూడ చౌరస్తా, ఐఐఐటీ జంక్షన్​, లింగంపల్లి రైల్వే అండర్​ బ్రిడ్జి, గచ్చిబౌలి కేర్​ ఆసుపత్రి ఎదురుగా,  రాయదుర్గం మెట్రో స్టేషన్​ కింద,  గచ్చిబౌలి రాడిసన్​ హోటల్​ ఎదురుగా రహదారులపై వర్షపు నీరు చేరింది. మాదాపూర్​ సైబర్​ టవర్స్​, సీఓడీ జంక్షన్​, కొత్తగూడ జంక్షన్​ల వద్ద గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాజేంద్రనగర్ సర్కిల్​లోని పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 192 వద్ద భారీగా వర్షపు నీరు చేరింది.  దీంతో ఎయిర్​పోర్టు మార్గంలో కింది నుంచి వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు వదిలే సమయానికి కూడా రోడ్లపై నీరు అలాగే ఉండడంతో ఇళ్లకు వెళ్లేందుకు పిల్లలు నానా తంటాలు పడ్డారు. 

ఎక్కడ చూసినా నీళ్లే

రాత్రి వరకు రికాం లేకుండా కురిసిన వానకు సిటీలోని అన్ని  ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట నీరు నిలిచి ఉన్న పరిస్థితి కనిపించింది. సికింద్రాబాద్​లోని పద్మారావు నగర్, బోయగూడా, బన్సీలాల్ పేటలో జోరుగా కురిసిన వర్షానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. మల్కాజ్​గిరి సర్కిల్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్ నేరెడిమెట్, వినాయక నగర్, మౌలాలి, గౌతమ్ నగర్ డివిజన్ల పరిధిలో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. దాంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.  శంషాబాద్ లోని సిద్దేశ్వర కాలనీ వద్ద బోనాల పండుగకు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ.. కరెంటు తీగలపై పడడంతో ఆ ప్రాంతంలో విద్యుత్​ నిలిచిపోయింది. అమీర్​పేట, పంజాగుట్ట, చాదర్​ఘాట్​, సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్​కు ఇబ్బంది ఏర్పడింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి రైల్వేగేట్ కింద మూసీ నది ఉధృతంగా పారుతూ ఉండడంతో అక్కడ పోలీస్ కాపలా ఏర్పాటు చేశారు. 

హఫీజ్​పేటలో 11.5 సెంటీమీటర్లు

హైదరాబాద్​ శివారు మండలాలైన శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ లో భారీ వర్షం కురిసింది. హఫీజ్​పేటలో 11.5 సెం.మీ., శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్లు, కూకట్​పల్లిలో 10.2, కుత్బుల్లాపూర్​లో 10.4, రాజేంద్రనగర్​లో 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్, గురుగోవింద్ కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. కేపీహెచ్​బీ కాలనీ మూడో  ఫేజ్​లోని ఎంఐజీ ఫ్లాట్స్ కూడా ముంపునకు గురయ్యాయి. ఎంఐజీ బ్లాక్స్ 87, 88, 89 లోని రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. వర్షం ఇలాగే కురిస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందోనని హైదరాబాదీలు భయం భయంతో ఉన్నారు. హైదర్​నగర్ డివిజన్​లోని నిజాంపేట రోడ్డు మొత్తం వరద నీటిలో మునిగింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

బాటసింగారంలో కొట్టుకుపోయిన బత్తాయిలు

సిటీ శివారులోని బాటసింగారం ఫ్రూట్​ మార్కెట్​కు పోటెత్తిన వానతో రైతులు తెచ్చిన పంట అమ్ముడుపోక కండ్ల ముందే వరద పాలైంది. దాంతో రైతులు లబోదిబోమన్నారు. కొత్తపేట నుంచి ఫ్రూట్​ మార్కెట్​ను తాత్కాలికంగా బాట సింగారానికి మార్చారు. అరకొర వసతులతో అధికారులు ఏర్పాట్లు  చేయడంతో రైతులు అక్కడి నుంచే అమ్మకాలు చేస్తున్నారు. వర్షంతో పక్కన ఉన్న గుట్టపై నుంచి భారీగా నీళ్లు మార్కెట్​లోకి వచ్చాయి. దాంతో రాశులుగా పోసి ఉన్న బత్తాయిలు ఆ వరదలో కొట్టుకుపోయాయి.