
- రాష్ట్రవ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు
- రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 78.3 మి.మీ. నమోదు
- హైదరాబాద్‌లో మళ్లీ వాన కష్టాలు
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
- ఐటీ కారిడార్‌లో రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ర్టంతోపాటు ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు, ఉపరితల ద్రోణుల ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రలో ఆదివారం రెండు, మూడు చోట్ల భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో అత్యధిక వర్షపాతం (78.3 మిల్లిమీటర్లు), జహీరాబాద్‌లో అత్యల్ప వర్షపాతం(14.5 మి.మీ) నమోదైంది.
గంట వర్షం.. మోకాళ్ల లోతులో నీరు
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాదాపూర్ రోడ్లన్నీ వర్షపు నీటితో చెరువులను తలపించాయి. గంట పాటు కురిసిన వర్షంతో మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మైండ్స్పేస్జంక్షన్, శిల్పారామం తదితర ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతులో వర్షం నీరు నిలిచింది. యూటర్న్ఉన్న పలు ప్రాంతాల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా సైబరాబాద్సీపీ సజ్జనార్రంగంలోకి దిగారు. ట్రాఫిక్డీసీపీ విజయ్‌కుమార్‌తో కలిసి హైటెక్స్‌లో పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. నాగోల్ లోని ఆదర్శ్ నగర్ కాలనీకి పై నుంచి వరద నీరు రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి చేరాయి.
సిటీలో మళ్లీ ట్రాఫిక్ జామ్
భారీ వర్షానికి హైదరాబాద్ మరోసారి వణికిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. మ్యాన్ హోల్స్ పొంగడంతోమురుగు నీరంతా రోడ్లపైకి చేరింది. దీంతో ప్రధాన కూడళ్లు నీటితో నిండి పోయాయి.ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆదివారం ఆఫీసులకు సెలవు కావడంతో కొంత ఇబ్బంది తప్పింది.