సింగరేణిలో ఎన్నికల వేడి

సింగరేణిలో ఎన్నికల వేడి

రాష్ట్ర ప్రభుత్వ  గ్రీన్​ సిగ్నల్​ కోసం వెయిటింగ్​

మందమర్రి, వెలుగు: దేళ్ల తర్వాత సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవల ఎన్నికలు నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం సంసిద్ధత వ్యక్తంచేసింది. దీంతో కోల్​బెల్ట్​ వ్యాప్తంగా గనులపై  హడావిడి కనిపిస్తోంది. ఎన్నికలు జరపాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎన్నికల నిర్వహణపై చర్చించుకుంటున్నారు. ఈ టైమ్​లో ఎన్నికలు పెడితే రాజకీయంగా తమకు లాభమా నష్టమాఅని ఆలోచిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర సర్కారు​నిర్ణయమే ఫైనల్​ అయినా జాతీయ సంఘాల డిమాండ్​తో ఎన్నికలకు ఒప్పుకోకతప్పేలాలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

రాష్ట్ర సర్కార్​ నిర్ణయమే కీలకం 

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కలిసి నిర్వహించాల్సిఉన్నప్పటికీ .. స్టేట్​ నిర్ణయమే ప్రధానం కానుంది. బొగ్గు గనులు  విస్తరించిన ఆసిఫాబాద్​,  మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాది కోత్తగూడెం, ఖమ్మం జిల్లాలో  ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించవలసిఉంటుంది. పోలింగ్​, కౌంటింగ్ బందోబస్తు కోసం పోలీసు బలగాలను దింపాలి. ఇదంతా రాష్ట్ర సర్కారే చేయాలి. కార్మికులకు స్టేట్​ గవర్నమెంట్​ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, సింగరేణిలో రాష్ట్ర సర్కార్ రాజకీయ జోక్యం, ప్రజాప్రతినిధుల ప్రభావం, సంస్థ నిధులు వేల కోట్లు రాష్ట్ర సర్కార్ మళ్లించడం,  కీలక నేతలు వలసలు తదితర అంశాలు టీఆర్​ఎస్​ను ఆలోచనలో పడేస్తున్నాయి. ఆరు జిల్లాల పరిధిలోని మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్,  భూపాలపల్లి, రామగుండం, మంథని, కొత్తగూడెం, ఇల్లందు, వైరా, పినపాక, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సింగరేణి ఓట్లే కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా..  కోల్​బెల్ట్ ఏరియాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంది. కేవలం మూడు చోట్ల మాత్రమే  టీఆర్ఎస్ గెలిచింది. 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 11 ఏరియాలకుగాను తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ గెలిచింది. ఆ తర్వాత ఏడాదిలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు కూడా సింగరేణి ఏరియాలో అధికారపార్టీ మీద వ్యతిరేకత ఉన్నట్టుసర్వేల్లో తేలినట్టు తెలిసింది. ఈ టైమ్​లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే  ప్రతికూల ఫలితాలు వస్తాయని టీ ఆర్​ఎస్​ పెద్దలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ  ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడవచ్చునని భయపడ్తున్నారు.  దీంతో గుర్తింపు ఎన్నికలపై  రాష్ట్ర సర్కార్ అంతగా ఆసక్తి చూపడంలేదు. సర్కారు నుంచి గ్రీన్​సిగ్నల్​ఇస్తే మాత్రం  కేంద్ర కార్మికశాఖ ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 

సింగరేణి వైపు ఓకే..

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని కొంతకాలంగా  కార్మికశాఖపై జాతీయ కార్మిక సంఘాలు ఒత్తిడితెస్తున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు ఓకే చెప్తూ రాష్ట్ర ఎనర్జీ డిపార్ట్​మెంట్​ ప్రిన్సిపల్​ సెక్రటరీకి ఈనెల 8న  సింగరేణి సీఎండీ లెటర్​ రాశారు.  గుర్తింపు సంఘం కాలపరిమితి ముగినందున ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 2017 అక్టోబర్​5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​ గెలిచింది. గుర్తింపు సంఘం గడువు 2019 అక్టోబర్​4తో ముగిసినందున ఎన్నికల నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్​ లేబర్​కమిషనర్​ గతంలోనే లేటర్​ రాశారని, కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలు పెట్టలేకపోయామని, ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని సీఎండీ తమ లేఖలో పేర్కొన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితిని మూడేళ్లకు పెంచాలని టీబీజీకేఎస్​ కోర్టులో కేసు వేయడం, కరోనా, బొగ్గు ఉత్పత్తి తదితర కారణాలతో 2019 తర్వాత ఎన్నికలు తరచూ వాయిదా పడుతూ వచ్చాయి.  2021 మార్చి తర్వాత ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉన్నట్టు భావించినా కొవిడ్​ సెకండ్​ వేవ్​ వల్ల యాజమాన్యం ఎన్నికల వాయిదా కోరింది.