బీజేపీ లీడర్లను నిద్రపోనివ్వని రాజాసింగ్.. రాష్ట్ర నేతలకు సవాళ్లు, కౌంటర్లు, విమర్శలు

బీజేపీ లీడర్లను నిద్రపోనివ్వని రాజాసింగ్.. రాష్ట్ర నేతలకు సవాళ్లు, కౌంటర్లు, విమర్శలు

రాజాసింగ్..ఓ ఫైర్ బ్రాండ్.! పార్టీలో ఉన్నా.. వీడినా తనదైన శైలిలో స్పందిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. గోషామహల్ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజాసింగ్ పార్టీ రాష్ట్రనాయక త్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలకు సవాళ్లు విసురుతూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన ఎన్నికల తీరు నచ్చలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని స్టేట్ కమిటీ జాతీయ నాయకత్వానికి పంపింది. జేపీ నద్దా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు.

అయితే తన ఆఫీసులో కమలం గుర్తును ఇప్పటి వరకు రాజాసింగ్ తొలగించుకోలేదు. ఆఫీసుపై బీజేపీ జెండా ఇంకా ఎగురుతూనే ఉంది. పార్టీజాతీయ నాయకత్వంపైనమ్మకం ఉందని, తాను హిందుత్వ ఎజెండాతో పనిచే స్తున్నానని, మోదీ, అమిత్ షా అంటే తనకు ఎంతో గౌరవమని వాళ్లు పిలిస్తే మళ్లీ పార్టీలో చేరుతానని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నీడలా వెంటాడుతు న్నారు. తప్పులను ఎత్తి చూపుతున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై విమర్శలు చేస్తున్నారు. 

అంతటితో ఆగక ఏకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికే సవాల్ విసిరారు. దమ్ముంటే రా తేల్చు కుందాం అంటూ తొడగొట్టారు. 'రాజీనామాచేసి రా ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దాం.. నా మీద గెలిచి చూపించు శాశ్వతంగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా.. రాజకీయ సన్యాసం తీసుకుంటా' అంటూ సవాలు చేశారు. రాష్ట్ర కమిటీలో పాత వాళ్లకు స్థానం ఇవ్వడం లేదని, ఇలా అయితే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు డమ్మీ అంటూ విమర్శ లుచేశారు. జిల్లాలు, గ్రామీణ ప్రాంతంలోని కార్యకర్తల అవసరం మీకు లేదా? అంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ కమిటీని రామచందర్ రావు వేశారా? లేకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబితే ఈ కమిటీ వేశారా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు రాజాసింగ్.

బీజేపీని అమ్మేశారు!!

మతమార్పిడి బిల్లును రాజస్థాన ప్రభుత్వం ఆమోదించిందని, హిందువులను బలవంతంగా మతం మార్చితే జీవిత ఖైదు విధించడంతోపాటు రూ.50 లక్షల జరిమానా విధించనున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఈ బిల్లు రాజస్థాన్ హిందువులకు చాలా ప్రయోజనకరమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అలాంటి చట్టం చేసేదని అన్నారు. కానీ దురదృష్ట వశాత్తూ కొంత మంది నాయకులు రాష్ట్రంలో బీజేపీని అమ్మేశారని ఫైర్ అయ్యారు. పార్టీని నిద్రపుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా.. తెలంగాణలో ఇలాంటి చట్టం చేస్తే, మీరు తెలంగాణ హిందువులకు దేవుడిగా నిరూపించుకోవచ్చన్నారు. మతమార్పిడి, లవ్ జిహాద్ గోవధపై చట్టాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.