
అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సోలిపేట
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. మున్సిపల్ బిల్లుపై చర్చ, ఆమోదం అనంతరం సభ వాయిదా పడింది. దీంతో సభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి ( టీఆర్ ఎస్ ), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( కాంగ్రెస్ ) అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధుల సమక్షంలో మాట్లాడుకున్న సంభాషణ ఆసక్తికరంగా సాగింది. అదేంటో వారి మాటల్లోనే..
రామలింగారెడ్డి: నువ్వు బీజేపీలోకి పోతే
నీ గొంతు నువ్వు కోసుకున్నట్లే.
రాజగోపాల్ రెడ్డి: మరి మీ టీఆర్ఎస్ ఓవర్ లోడ్ తో ఉంది. నాది ఓవర్ వెయిటాయె.. నేనొస్తే అది మునిగిపోద్ది.
రామలింగారెడ్డి: నీలాంటోడు బీజేపీలో సెట్ కారు. మళ్లీ 10 ఏళ్లకైనా సరే బయటకు రాక తప్పదు.
రాజగోపాల్ రెడ్డి: నాలాంటి పోరాడే వ్యక్తి బీజేపీలో ఉండడమే కరెక్ట్. మీలాంటి ప్రాంతీయ పార్టీలు మాకు సరిపోవు,
రామలింగారెడ్డి: బీజేపీలో చేరే ముందు ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్.
రాజగోపాల్ రెడ్డి: మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మందిని రాజీనామా చేయించే టీఆర్ఎస్ లో చేర్చుకున్నరా!
రామలింగారెడ్డి: వాళ్లు వేరు. నీలాంటి నాయ కుడు రాజీనామా చేసి వెళ్తేనే విలువుంటుంది కదా.
రాజగోపాల్ రెడ్డి: నాకు రాజీనామా చేయాలని ఉంది. కానీ నా నియోజకవర్గ ప్రజలు మాత్రం, పార్టీ మారినా సరే, ఎమ్మెల్యేగా మీరే ఉండాలని అంటున్నరు.
రామలింగారెడ్డి: కాషాయం జెండా కప్పుకుంటే నీవు ఎదగడం కాదు, ఉరేసుకున్నట్లే.
ఇద్దరి మధ్య ఇలా సంభాషణ జరుగుతుండగా, మీడియా ప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి మరోసారి తాను బీజేపీలోకి వెళ్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆ పార్టీలో ఎప్పుడు చేరేది మాత్రం వెల్లడించలేదు. తాను బీజేపీలో చేరడం, తెలంగాణలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం పక్కా అని చెప్పారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే తాను మాత్రం సీఎం రేసులో ఉండబోనని స్పష్టం చేశారు. తాను పదవులు ఆశించి ఆ పార్టీలోకి వెళ్లడం లేదని, కేవలం దేశ భవిష్యత్తును మాత్రమే దృష్టి లో ఉంచుకొని చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తానేదో సీఎం అవుతానని ఓ కార్యకర్తతో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేశారని, వాస్తవానికి తాను తన అనుచరులకు ధైర్యం చెప్పేందుకు మాత్రమే బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని అలా చెప్పానని రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. బీజేపీలో తాను చేరిన వెంటనే రాష్ట్రంలోని 90 శాతం యువత ఆ పార్టీలోకి వస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననీ, అప్పడు రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజ్‌గోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ ఆధిపత్యం, జాతీయ పార్టీల్లో స్వేచ్ఛ, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయన్నారు. తాను కాంగ్రెస్ ను, సోనియాను ఎప్పటికీ మరవనని, అయితే ఇప్పుడు ఆ పార్టీని నడిపేందుకు ముందుకు వచ్చే వారు లేరని, స్వయంగా రాహులే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ పదవి ఇస్తానంటే తానే వద్దన్నానని, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏముంటుందనే ఉద్దేశ్యంతో తాను ఆ పదవి వద్దని తిరస్కరించానన్నారు. అందుకే ఇప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ప్రచారంలో ఉందని రాజ్‌గోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి తానొక్కడినే బీజేపీలోకి వెళ్తున్నానని, తన తర్వాత తన సోదరుడు ఎంపీ, వెంకటరెడ్డి, ఇంకా చాలా మంది వస్తారని చెప్పారు.