MaheshBabu: చరిత్ర సృష్టించనున్న రాజమౌళి.. ప్యారిస్‌ వేదికగా 'వారణాసి' టీజర్ లాంచ్!

MaheshBabu: చరిత్ర సృష్టించనున్న రాజమౌళి.. ప్యారిస్‌ వేదికగా 'వారణాసి' టీజర్  లాంచ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ . రాజమౌళి కాంభినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' వారణాసి' . ఈ టాలీవుడ్ మూవీ బాలీవుడ్ లోనే కాదు.. గోబల్ సినిమాగా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.  భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇప్పుడు సరికొత్త చరిత్రకు వేదిక కానుంది. లేటెస్ట్ గా వచ్చిన ఈ అప్డేట్ మహేష్ బాబు అభిమానులను సంబరాల్లో మంచెత్తుతుంది.

యూరప్ అతిపెద్ద థియేటర్‌లో టీజర్ లాంచ్!

సాధారణంగా సినిమాల టీజర్లు యూట్యూబ్ లేదా స్థానిక థియేటర్లలో విడుదలవుతాయి. కానీ రాజమౌళి ప్లానింగ్ వేరే లెవల్లో ఉంది. ఈ సినిమా టీజర్‌ను ఏకంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ‘లే గ్రాండ్ రెక్స్’ (Grand Rex) థియేటర్‌లో విడుదల చేయబోతున్నారు. 2,702 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ యూరప్‌లోనే అతిపెద్దది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఒక భారతీయ చిత్ర టీజర్‌ను ప్రదర్శించడం ఇదే తొలిసారి. జనవరి 5 రాత్రి 9 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది.

ఫ్రెంచ్ పంపిణీ సంస్థ 'అన్న ఫిల్మ్స్' సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "రాజమౌళి , ఆయన టీమ్ మరో గ్రహంలో ఉన్నారు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా గ్రాండ్ రెక్స్‌లో 'వారణాసి' టీజర్ ప్రదర్శితం కాబోతోంది" అంటూ కొనియాడారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

 

హాలీవుడ్ రేంజ్‌లో తారాగణం

శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ సెట్ అయ్యింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ బాబు సరసన నటిస్తుండటంతో ఈ సినిమాకు అంతర్జాతీయ క్రేజ్ దక్కింది.  మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు.

గ్లోబ్‌ట్రాటర్ అడ్వెంచర్

కొద్దిరోజుల క్రితం విడుదలైన 'గ్లోబ్‌ట్రాటర్' (Globe Trotter) టైటిల్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేసింది.  రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈవెంట్ లో ఈ మూవీకి ' వారణాసి' టైటిల్ ఖరారు చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ కథలో మహేష్ బాబు లుక్ సరికొత్తగా ఉండబోతోందని ఈ వీడియో ద్వారా చూపించారు.. ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లెవల్‌కు మన సినిమాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజమౌళి ప్రతి అడుగును ఆచి తూచి వేస్తున్నారు.

మార్చి 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విడుదల కంటే ఏడాదిన్నర ముందే ప్యారిస్‌లో టీజర్ రిలీజ్ చేయడం చూస్తుంటే.. ప్రమోషన్ల విషయంలో రాజమౌళి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానులు ఈ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.