వరద బాధితులకు మహిళల అండ.. గుప్పెడు బియ్యం కార్యక్రమంతో 20 క్వింటాళ్లు సేకరణ

వరద బాధితులకు  మహిళల అండ.. గుప్పెడు బియ్యం కార్యక్రమంతో 20 క్వింటాళ్లు సేకరణ
  • గుప్పెడు బియ్యం కార్యక్రమంతో 20 క్వింటాళ్లు సేకరణ
  • వరద బాధితుల ఆకలి తీర్చేందుకు రాజంపేట మండల సభ్యుల ఆదరణ
  • 200 మంది వరద బాధితులకు సాయం 
  • ఒక్కో కుటుంబానికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ

కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వరద బాధితులకు అండగా నిలిచారు. ‘గుప్పెడు బియ్యం’ సేకరణ కార్యక్రమంతో 20 క్వింటాళ్ల బియ్యం సేకరించి 200 మంది నిరాశ్రయులకు అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం తోపాటు మహిళలు సాయం చేసి దాతృత్వాన్ని చాటారు. ఒక్కో సభ్యురాలు అందించిన గుప్పెడు బియ్యం కొద్ది రోజులైనా బాధితుల ఆకలి తీర్చనుంది. 

‘గుప్పెడు బియ్యం’తో భరోసా.. 

ఆగస్టు నెల చివరి వారంలో కురిసిన భారీవర్షాల వల్ల జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది.  పలు గ్రామాలు, తండాలు నీట మునిగి అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఆహారపదార్థాలు, నిత్యావసర వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి. వరద బాధితులకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం తోపాటు స్వయం సహాయక సంఘాలు ముందుకొచ్చాయి. రాజంపేట మండల మహిళా సంఘాలు చేపట్టిన ‘గుప్పెడు బియ్యం’ సేకరణ కార్యక్రమంతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచాయి. 

నిరాశ్రయుల ఆకలి తీర్చేలా.. 

భారీ వరదలతో రాజంపేట మండలంలోని నడిమి తండా, ఎల్లాపూర్ తండా వాసులు నిరాశ్రయులయ్యారు. వారి ఆకలి తీర్చేందుకు మండలంలోని స్వయం సహాయక సంఘాలు ‘గుప్పెడు బియ్యం’ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి 20 క్వింటాళ్లు సేకరించాయి. మండలంలోని 20 గ్రామ సమాఖ్యలకు చెందిన 6 వేల మంది మహిళలు ఒక్కొక్కరు గుప్పెడు బియ్యం అందించగా, ఆ బియ్యం సమాఖ్యల ద్వారా చేరి 200 మంది బాధితులకు పంపిణీ చేయనున్నారు. 

ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం అందజేయగా, ఈ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంలో మహిళా సంఘాల దాతృత్వం బాధితులకు ధైర్యాన్ని ఇస్తుందని అధికారులు తెలిపారు. 

బాధితులకు భరోసా కల్పించడం అభినందనీయం

కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

వరద బాధితులకు మేమున్నామని మహిళా సంఘాలు భరోసా కల్పించడం అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రాజంపేట మండలంలోని 20 గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో 584 సంఘాల సభ్యులు ‘గుప్పెడు బియ్యం’ కార్యక్రమంలో సేకరించిన బియ్యాన్ని బాధితులకు శనివారం కలెక్టర్​ అందజేశారు. 

ప్రభుత్వం అందించే సహకారంతో పాటు దాతల సాయం బాధితులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, ఎపీఎం రాజారెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి లత, ఖజాంచి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

పేదలను ఆదుకోవడమే ఉద్దేశం

కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడమే మా ఉద్దేశం. రాజంపేట మండల వరద బాధితుల ఆకలి తీర్చేందుకు స్వయం సహాయక సంఘాలు ‘గుప్పెడు బియ్యం’ కార్యక్రమం చేపట్టారు. ప్రతి సభ్యురాలు బియ్యం అందజేసి మానవత్వాన్ని చాటారు.  - సురేందర్, డీఆర్డీవో, కామారెడ్డి