
భిల్వారా(రాజస్తాన్): వివాహేతర సంబంధం పెట్టుకుని బిడ్డను కన్న మహిళ.. ఆ శిశువును వదిలించుకోవాలని అడవిలో వదిలేసింది. పాప ఏడుపు ఎవరికీ వినిపించకుండా ఉండేందుకు ఆ పసికందు నోట్లో రాయిపెట్టి, మూతికి ఫెవిక్విక్ అంటించింది. అదే రోజు అటుగా వెళ్లిన పశువుల కాపరి ఎవరో మూలుగుతున్నట్లు వచ్చిన శబ్దం విని ఆ చంటిబిడ్డను కాపాడి పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించారు.
రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాలో రెండ్రోజుల కింద ఈ ఘటన జరగ్గా.. శనివారం తల్లిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల ఆమెకు బాబు పుట్టినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. బాబు పుట్టాక ఎవరికైనా అమ్మేద్దామనుకున్న తల్లి, అది సాధ్యం కాకపోవడంతో వదిలించుకోవాలనుకుందని చెప్పారు. ఆమె తన తండ్రితో కలిసి దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లి చంటిబిడ్డను వదిలేసిందని చెప్పారు. పాప ఏడుపు ఎవరికీ వినిపించొద్దని నోట్లో రాయి పెట్టి, పాప మూతిని గమ్‌తో అతికించిందన్నారు.