
- నిందితుడికి రేబిస్ డాగ్ కరవడంతో హైడ్రోఫోబియాకు గురైండన్న డాక్టర్లు
జైపూర్: అడవిలో మేకలను మేపుతున్న వృద్ధురాలిని ఓ వ్యక్తి రాయితో కొట్టి చంపాడు. తర్వాత ఆమె మాంసాన్ని తినేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని పాలి జిల్లా శారధన గ్రామంలో శుక్రవారం జరిగింది. శారధనకు చెందిన శాంతి దేవి (65) మేకలను మేపటానికి అడవికి వెళ్లగా సురేంద్ర ఠాకూర్ (24) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే, ముసలామె మాంసాన్ని తింటున్న సురేంద్రను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శాంతి దేవి డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, సురేంద్ర ఠాకూర్ కు గతంలో కుక్క కరవడంతో రేబిస్ ఇన్‌ఫెక్షన్ కు గురయ్యాడని, అతను హైడ్రోఫోబియా(నీటి భయం)తో బాధపడుతున్నాడని డాక్టర్లు వెల్లడించారు. అందుకే అతడు పిచ్చి పట్టినట్లుగా, అగ్రెసివ్ గా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. నిందితుడు సురేంద్ర ఒక మానసిక రోగి అయినందున అతడిని అరెస్ట్ చేయకుండా ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు వెల్లడించారు. మృతురాలు శాంతి దేవి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేంద్రపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.