గువాహతి: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ హవా కొనసాగుతోంది. మెగా టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ రాయల్స్ విజయం అందుకుంది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన పోరులో యశస్వి జైస్వాల్ (32 బాల్స్‌లో 40 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆర్ఆర్ 27 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్తాన్ 150/3 స్కోరు చేసింది.
వైభవ్ సూర్యవంశీ (14 బాల్స్‌లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 39) కూడా దంచికొట్టాడు. అనంతరం ఛేజింగ్‌లో ముంబై 11 ఓవర్లలో 123/9 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (8 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25), నమన్ ధీర్ (13 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 25) టాప్ స్కోరర్లు. రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, బర్గర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
జైస్వాల్ ధనాధన్
వర్షంతో మ్యాచ్ ఆలస్యం అయిన వేళ.. చినుకులు తగ్గగానే రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ల మెరుపులు మొదలయ్యాయి. తొలి బాల్ నుంచే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ బౌండరీలను టార్గెట్ చేశారు. దీపక్ చహర్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో 22 రన్స్ పిండుకున్నాడు. వరల్డ్ క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ పైచేయి సాధించాడు. రెండో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రాకు రెండు సిక్సర్లతో వెల్‌కం చెప్పాడు.
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో జైస్వాల్ రెండు, వైభవ్ ఓ సిక్స్ బాదడంతో 3 ఓవర్లకే స్కోరు 50 దాటింది. నాలుగో ఓవర్లో కెప్టెన్ హార్దిక్ నాలుగే రన్స్ ఇచ్చి కట్టడి చేశాడు. కానీ శార్దూల్ బౌలింగ్‌లో 6, 4, 6 కొట్టిన వైభవ్ మరో షాట్‌కు ట్రై చేసి తిలక్‌కు చిక్కడంతో తొలి వికెట్‌కు 80 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆ వెంటనే ధ్రువ్ జురెల్ (2)ను ఘజన్‌ఫర్ ఎల్బీ చేసినా.. జైస్వాల్ వెనక్కుతగ్గలేదు.
తన ధాటిని కొనసాగించి 23 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పాటు స్కోరు వంద దాటించాడు. మరోవైపు హార్దిక్, ఘజన్‌ఫర్ ఓవర్లో రెండు సిక్సర్లతో జోరు మీద కనిపించిన కెప్టెన్ రియాన్ పరాగ్ (20) ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టిన జైస్వాల్ .. శార్దూల్ వేసిన చివరి ఓవర్లో మూడు ఫోర్లతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.
ముంబై ఢమాల్
రాజస్తాన్ దంచికొట్టిన వికెట్‌పై భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ముంబై బ్యాటర్లు తడబడ్డారు. ఆతిథ్య బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే ర్యాన్ రికెల్టన్ (8)ను ఔట్ చేసిన జోఫ్రా ఆర్చర్ ముంబైని దెబ్బకొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చి ఓ సిక్స్‌తో అలరించిన సూర్యకుమార్ (6)ను రెండో ఓవర్లో బర్గర్ వెనక్కుపంపడంతో మరో షాక్ తగిలింది.
భారీ అంచనాలున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (5).. సందీప్ శర్మ యార్కర్‌కు ఎల్బీ అవ్వడంతో ముంబై 22/3తో డీలా పడింది. అక్కడితో కష్టాలు ఆగలేదు. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడు బాల్స్ తేడాలో కెప్టెన్ హార్దిక్ (9), తిలక్ వర్మ (14)ను పెవిలియన్ చేర్చడంతో 46 రన్స్ సగం టీమ్ డగౌట్ చేరింది. ఈ టైమ్‌లో నమన్ ధీర్ , షెర్ఫానే రూథర్‌ఫర్డ్ భారీ షాట్లతో ఎదురుదాడికి దిగారు.
బిష్ణోయ్ ఓవర్లో రెండు ఫోర్లు, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన రూథర్‌ఫర్డ్ మరో షాట్‌కు ప్రయత్నించి సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే బర్గర్ వేసిన తొమ్మిదో ఓవర్లో నమన్ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై ఓటమి ఖాయమైంది. శార్దూల్ ఠాకూర్ (8), ట్రెంట్ బౌల్ట్ (1) కూడా నిరాశపరిచారు. దీపక్ చహర్ (6 నాటౌట్), బుమ్రా (5 నాటౌట్) టీమ్‌ను ఆలౌట్ కాకుండా చూసుకున్నారు.
